గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం!
వచ్చే ఏడాది జనవరి రెండో వారం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఏడాది జనవరి రెండో వారం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎలక్షన్స్‌కు ముందు జరగాల్సిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణలను పూర్తి చేసింది. ప్రధానంగా రిజర్వేషన్లను ఐదేండ్లకోసారి మార్చే సవరణకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటితోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణలో అనేక మార్పులు చేశారు. ఒక మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండే విధంగా మార్పు చేశారు. 80 గ్రామాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేశారు. కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయగా, రెండింటిని కార్పొరేషన్లుగా అప్ గ్రేడ్ చేశారు. ఇలా ఎన్నికలకు చట్ట పరంగా చేయవలసిన ఏర్పాట్లన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. మరోవైపు ఎన్నికల కమిషన్ సైతం ఓటరు జాబితాను, పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేసింది.
డెడికేటెడ్ కమిషన్ నివేదిక తరువాయి..
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ను సుప్రీంకోర్టు సూచించిన విధంగా ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే జిల్లా పర్యటనలు, బహిరంగ వినతులు స్వీకరించి నివేదికను ప్రాథమికంగా సిద్ధం చేసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కంప్యూటరైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తి కాగానే కమిషన్ కు డేటా అందిస్తారు. దాని ఆధారంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత కేబినెట్ నివేదికపై చర్చించి ఆమోదించి రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది. అనంతరం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను ఖరారు చేసి ఎన్నికల కమిషన్‌కు అందించనుంది. అనంతరం ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
ముందు ‘గ్రామం’.. తర్వాత ‘పట్టణం’
సర్పంచులు ఎంపీపీ, జడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. వీటిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ముందుగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎంపీటీసీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో ఐదింటిని ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మొదట గ్రామీణ స్థానిక సంస్థలు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు.
మున్సిపాలిటీల పదవీ కాలం జనవరి చివరి వారంలో ముగియనున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం కష్టపడ్డ వారందరికీ వివిధ రకాల పదవులు దక్కే విధంగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధికంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పదవులు దక్కనున్నాయి. వీటిని అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఎవరెవరితో పోటీ చేయించాలో ఎమ్మెల్యేలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.