కన్నాకు ఆ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదా..? అందుకే టీడీపీలో చేరుతున్నారా..?

అంతా ఊహించినట్లుగానే జరిగింది. బీజేపీకి మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పేశారు.

Update: 2023-02-16 09:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అంతా ఊహించినట్లుగానే జరిగింది. బీజేపీకి మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పేశారు. ఇక కాషాయదళంలో ఉండలేమని చెప్పి రాం రాం చెప్పేశారు. ఇదే విషయాన్ని దిశ జనవరి 24న ప్రత్యేకంగా ప్రచురించింది. అయితే కన్నా రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే నిన్న మెున్నటి వరకు జనసేన పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ టీడీపీలో చేరాలని అభిమానులు, కార్యకర్తలు కన్నా లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 23న లేదా 24న కన్నా లక్ష్మీనారాయణ సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ కీలక నేతలతో పలు దఫాలుగా కన్నా లక్ష్మీనారాయణ సమావేశం అయ్యారని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతోపాటు రాజకీయంగా మంచి భవిష్యత్ కల్పిస్తామని పార్టీ నాయకత్వం నుంచి హామీ రావడంతో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ వీడి సైకిల్ ఎక్కనున్నారని తెలుస్తోంది.

సోము వీర్రాజుతో కయ్యం

రాజకీయాల్లో సీనియర్ కన్నా లక్ష్మీనారాయణ. గతంలో పలుమార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్ లేదని భావించిన కన్నా అనంతరం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్రమోడీ పాలన పట్ల ఆకర్షితులై బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే బీజేపీ జాతీయ నాయకత్వం మంచి గుర్తింపు ఇచ్చింది.ఈ క్రమంలో 2018లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఛాన్స్ కల్పించింది. పార్టీలో సీనియర్లు ఉన్నప్పటికీ వారందరినీ కాదని కన్నాకే అవకాశం కల్పించడం అప్పట్లో రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపింది.

అయితే అయితే 2019 ఎన్నికల తర్వాత కన్నాను తప్పించి బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణకు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మధ్య రాజకీయ వైరం నెలకొంది. రాష్ట్రంలో బీజేపీనీ బలోపేతం చేస్తూ 2024 లో మోడీని అధికారంలోకి తీసుకొని రావడానికి అందరితో కలిసి పని చేస్తానని గతంలోనే కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. అయితే సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా తనపట్ల కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అవే కారణాలు చెప్తూ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

తన ముద్ర లేకుండా చేస్తున్నారనే ఆవేదన..

సోము వీర్రాజుకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ మౌనం వహించడం మెుదలు పెట్టారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన కన్నా సోముతో పొసగకపోవడంతో దూరమయ్యారు. అనంతరం కన్నా హయాంలో నియమించిన జిల్లా అధ్యక్షులను రాష్ట్ర, జిల్లాల కార్యవర్గాలను పూర్తిగా మార్చివేయడంతో కన్నా తొలిసారి పెదవి విప్పారు. కనీసం తన సొంతజిల్లా అధ్యక్షుడిని మార్చినప్పుడు కూడా సమాచారం ఇవ్వకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో చేర్పించానని అయితే వారంతా ఇప్పుడు పార్టీ వీడుతున్నారని ఎందుకు వీడుతున్నారో సోము వీర్రాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి సోము వీర్రాజు వియ్యంకుడు సైతం బీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. వియ్యంకుడు బీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరాడో సోము వీర్రాజు సమాధానం చెప్పాలంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

అప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఛాన్స్ దొరికినప్పుడల్లా రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వంపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు రాజ్యసభ సభ్యలు జీవీఎల్ నరసింహారావులపై విమర్శల దాడి చేస్తున్నారు. పార్టీలో కన్నా ముద్ర లేకుండా చూడాలని సోము వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నారని అందుకు జీవీఎల్ సహకరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అంతేకాదు టీడీపీ, జనసేనలతో పొత్తుకు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావులే ప్రధాన అడ్డంకులంటూ బహిరంగ విమర్శలు చేశారు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో బీజేపీ బలహీనం కావడానికి, పవన్ బీజేపీకి దూరమవ్వడానికి ఇద్దరి నేతల వ్యవహారశైలే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కాపులకు ఏం చేశారని ఎంపీ జీవీఎల్ సన్మానాలు చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. రాజ్యసభలో చిన్న ప్రశ్నకు ఇన్ని సన్మానాలు అవసరమా? జీవీఎల్ రాజ్యసభలో వేసిన ప్రశ్న గూగుల్‌లో వెతికినా కనిపిస్తుంది కదా..? అంటూ ధ్వజమెత్తారు.

జనసేన అనుకుని టీడీపీలోకి

తొలుత జనసేనలో చేరుతారని అంతా భావించారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కన్నాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీతో కన్నా బీజేపీ వీడటం ఖాయమని.. జనసేన పార్టీ కండువా కప్పుకోవడం తథ్యమని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంపై కన్నా లక్ష్మీనారాయణ స్పందించలేదు సరికదా కనీసం ఖండించనూ లేదు. అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్‌కు తాను అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్‌ను బలహీనపరిచేందుకు అటు కేసీఆర్ ఇటు జగన్‌లు కలిశారని అందుకే బీఆర్ఎస్ పార్టీ చేరికలు అంటూ సంచలన ఆరోపణలు సైతం చేశారు. దీంతో ఇక కన్నా జనసేనలోకి రావడం లాంఛనమే అన్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు ఫిబ్రవరి మెుదటి వారంలో పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతారని కూడా ముహూర్తం ఫిక్స్ చేసేశారు. అయితే బీజేపీతో పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ కన్నా చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. దీంతో ఇక చేసేది లేక టీడీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24న చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకుంటారని కూడా తెలుస్తోంది.

సత్తెనపల్లి లేదా.. నరసరావుపేట నుంచి పోటీ

ఇకపోతే కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1989లో రాజకీయారంగేట్రం చేసిన ఆయన పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేదురుమిల్లి జనార్థనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో మంత్రిగా వెలుగొందారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ వీడి బీజేపీ గూటికి చేరారు. కమలం కండువాకప్పుకున్నారో లేదో ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి సత్తెనపల్లి అసెంబ్లీ నుంచి కానీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా గానీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనసేనలోకి చేరుతారా లేక టీడీపీలో చేరుతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News