రేవంత్‌కు అంత రోషమెందుకు.. ఈటల వ్యాఖ్యలు నిజం కాదా?
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైందని, అది ప్రజలకు బహిరంగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెబితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అంత రోషమెందుకని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైందని, అది ప్రజలకు బహిరంగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెబితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అంత రోషమెందుకని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈటలపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలు అనుకుంటున్నారని ఈటల చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని డీకే అరుణ ప్రశ్నించారు. దానికి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తాడుముకునట్టు రేవంత్ రెడ్డి తీరుందని ఆమె చురకలంటించారు. కేవలం మీడియాలో ఉండేందుకు డ్రామాలాడుతున్నాడని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఎన్నోసార్లు రుజువైందని, అది ప్రజలకు బహిరంగంగా ఈటల చెబితే అంత రోషమెందుకని ఫైరయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం గతంలో హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. గల్లీలో, ఢిల్లీలో లేని పార్టీ కాంగ్రెస్ అని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈటల రాజేందర్‌పై చేస్తున్న ఆరోపణలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్క్రిప్టేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌పై ఈటల వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీ ఎందుకు స్పందించారని, ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పేందుకు ఇది చాలదా అని ప్రశ్నించారు. సోదరా.. రేవంత్ వాస్తవాలను జీర్ణించుకోవాలని సూచించారు.
భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తున్న రేవంత్ రెడ్డి తనకు ఓటుకు నోటు కేసులో ఎలాంటి సంబంధం లేదని, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని కూడా ప్రమాణం చేస్తాడా? అని డీకే అరుణ సవాల్ విసిరారు. బీసీ నేత అయిన ఈటలపై ఇంత ఘాటు విమర్శలు చేస్తారా? అని ఆమె ధ్వజమెత్తారు. మీరు ఏది మాట్లాడినా చెల్లుతుందనుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ముమ్మాటికీ రెండూ ఒక్కటేనని, బీఆర్ఎస్, బీజేపీ ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికలకు ముందో.. తర్వాతో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై లబ్ధి పొందుతాయని, దీన్ని జీర్ణించుకోవాలన్నారు. తామంతా ఒక్కటేని, తమ టార్గెట్ బీజేపీ అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని డీకే అరుణ హెచ్చరించారు.