ఓల్డ్ ఈజ్ గోల్డ్.. రీసేల్ ప్లాట్లకే గిరాకీ

దిశ, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్ రంగం 2017 నుంచి అనేక ఒడిదుడుకుల మధ్య కొట్టుమిట్టాడింది పెద్దనోట్ల రద్దు, రెరా, జీఎస్టీ అమలు వంటివి ఉక్కిరిబిక్కిరి చేయగా, తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల నిలుపుదల, ఎల్ఆర్ఎస్ వంటివి అమలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నింటినీ తట్టుకుంటూ ఇప్పుడిప్పుడే రియల్​ ఎస్టేట్​ రంగం గాడిన పడుతుండడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. నెల రోజుల నుంచి ప్లాట్లకు కాస్త గిరాకీ పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, జిల్లా కేంద్రాల […]

Update: 2021-01-28 13:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్ రంగం 2017 నుంచి అనేక ఒడిదుడుకుల మధ్య కొట్టుమిట్టాడింది పెద్దనోట్ల రద్దు, రెరా, జీఎస్టీ అమలు వంటివి ఉక్కిరిబిక్కిరి చేయగా, తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల నిలుపుదల, ఎల్ఆర్ఎస్ వంటివి అమలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నింటినీ తట్టుకుంటూ ఇప్పుడిప్పుడే రియల్​ ఎస్టేట్​ రంగం గాడిన పడుతుండడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. నెల రోజుల నుంచి ప్లాట్లకు కాస్త గిరాకీ పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, జిల్లా కేంద్రాల శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ కార్యాలయాలు మళ్లీ తెరచుకున్నాయి.

రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో చాలా ప్రాంతాలలో పాత ప్లాట్లు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడో వేసిన లేఅవుట్లయినా సరే వాటిలోని ప్లాట్లు ఎక్కువగా చేతులు మారి ఉంటాయి. అలాంటి వాటిని కొనుగోలు చేయడం ద్వారా నమ్మకం పొందొచ్చు. తమ కంటే ముందు కొనుగోలు చేసిన వారు డాక్యుమెంట్లన్నీ పరిశీలించి ఉంటారన్న విశ్వాసాన్ని చూపిస్తున్నారు. దానికి తోడు ప్లాటు సరిహద్దులలోనూ ఎలాంటి వివాదాలు తలెత్తవని అభిప్రాయపడుతున్నారు.

ఆఖరికి సాగు భూముల క్రయ విక్రయాలు కూడా ఇప్పటికే ఒకరో, ఇద్దరి చేతులు మారి ఉన్న వాటి వైపే ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా వేసే లేఅవుట్లకు హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు తప్పనిసరి. ఓపెన్ స్పేస్ వదిలేయడం, పార్కు స్థలాలు, పెద్ద రోడ్లకు స్థలం ఎక్కువగా పోతుంది. దీంతో ప్లాట్ల ధరలు రెట్టింపు చేసి అమ్మాల్సిందే. గతంలోనే వేసిన లేఅవుట్లలోని ప్లాట్ల కొనుగోలుకు ఎలాంటి ఆంక్షలు లేవు. పైగా రిజిస్ట్రేషన్ల గొడవ లేదు. ఎల్ఆర్ఎస్ డబ్బులు కూడా ఇప్పటికిప్పుడు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అందుకే అనుమతి పొందిన లేఅవుట్ల కంటే పాత వెంచర్లలో చేతులు మారిన ప్లాట్లకే గిరాకీ పెరిగినట్లు రియల్టర్లు చెబుతున్నారు.

మొదలైన ప్లాట్ల సందడి

15, 20 ఏండ్ల కిందట వేసిన లేఅవుట్లకు గిరాకీ పెరుగుతోంది. మొన్నటి వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోని లేఅవుట్లలో మళ్లీ సందడి మొదలైంది. అప్పట్లో గజం రూ.1000, 2000లకు ఇప్పుడు రూ.10 వేల వరకు వస్తుందని ఆశిస్తున్నారు. ఇలాంటి లేఅవుట్లు ప్రధానంగా హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే అధికం. బౌరంపేట నుంచి బడంగ్ పేట, శంకర్ పల్లి నుంచి శామీర్ పేట, రాజేంద్రనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ, నార్సింగి నుంచి షాద్ నగర్ వేలల్లో పాత లేఅవుట్లు దర్శనమిస్తాయి.

ఆ పాత లేఅవుట్ల ప్లాట్లకే మొగ్గు చూపుతున్నారు. బోడుప్పల్, ఘట్ కేసర్, శామీర్ పేట, మేడ్చల్, కొంపెల్లి, శంకర్ పల్లి, కొల్లూరు, ఆదిభట్ల, అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహింపట్నం ప్రాంతాల్లో జోరుగా రీసేల్ ప్లాట్లు అమ్మకానికి ముందుకొస్తున్నారు. సాగు భూముల అంశంలో శంకర్ పల్లి, షాద్ నగర్, వికారాబాద్, పరిగి, షాబాద్, యాచారం మండలాల వైపు వెళ్తున్నారు. ఎకరం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు కావాలనుకునే వారేమో ఇంకాస్త దూరమైన వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా నల్లగొండ, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, సూర్యాపేట జిల్లాల్లోని మారుమూల పల్లెల్లోనూ పట్టణవాసులు కొనుగోలు చేసిన వ్యవసాయ భూములు దర్శనమిస్తున్నాయి.

కొత్త వాటికి ఆంక్షలెక్కువ

కొత్తగా లేఅవుట్లు వేసేందుకు ప్రభుత్వ ఆంక్షలు ఎక్కువ. రెరా, హెచ్ఎండీఏ, డీటీసీపీ సంస్థల నిబంధనలన్నీ పాటించాలి. ఆయా అధికారుల చుట్టూ తిరగాలి. అందుకే కొత్తగా వేసేందుకు చిన్న రియల్టర్లు ముందుకు రావడం లేదు. బడా సంస్థలు మాత్రమే ధైర్యం చేస్తున్నాయి. రూ.వేల కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలు మాత్రమే ముందుకొస్తున్నట్లు సమాచారం. గతంలో 10 ఎకరాల లోపు వెంచర్లు వేసి క్రయ విక్రయాలు జరిపిన చిన్న రియల్టర్లు ఏజెంట్లుగా మారారు. పాత ప్లాట్ల రీసేల్ వ్యాపారానికి మొగ్గు చూపుతున్నారు. కొత్తగా లేఅవుట్లు వేసినా రేట్లు ఎక్కువగా పెట్టాలి. ఇప్పటికిప్పుడు రూ.కోట్లు పెట్టుబడి పెడితే చాలా కాలం అమ్మేందుకు వినియోగదారుల కోసం ఎదురుచూడాల్సిందేనంటున్నారు.

పెరిగిన కొనుగోలుదార్ల సంఖ్య

లాక్ డౌన్ తర్వాత చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు 50 కి.మీ. దూరంలోనైనా సరే ప్లాట్లు, 100 కి.మీ. దూరంలోనైనా వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో రీసేల్ ప్లాట్లు, సాగు భూములకు గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే టైటిల్, సరిహద్దులు పక్కాగా ఉన్నాయనుకున్న వాటిని చూస్తున్నారు.

సాగు భూములైతే చుట్టూ కడీలు పాతి, ఇనుప కంచె చుట్టిన వాటితో నమ్మకం కలుగుతోంది. కొనుగోలు చేసిన వారు వారి హద్దులను పక్కా చేసుకున్నారంటూ ఇరుగుపొరుగు వారితో ఎలాంటి ఇబ్బందులు లేవన్నట్లుగా భావిస్తున్నారు. ప్రధానంగా రోడ్లు, బస్సు సదుపాయం ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పునరుద్ధరించిన తర్వాత భూముల ధరలు మళ్లీ పెరిగాయి. ప్లాట్లు, వ్యవసాయ భూములు ఏవైనా రియల్ ఎస్టేట్ భూం మళ్లీ వచ్చిందని ఏజెంట్లు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నిండే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News