వంద కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్!
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న బొమ్మకల్ గ్రామంలో దాదాపు రూ. వంద కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు హాంఫట్ అయ్యాయి. బొమ్మకల్ శివారులో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉండగా, కబ్జాదారులు వాటిని యథేచ్చగా అమ్మేసుకుంటున్నారు. గ్రామ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే గ్రామంలో భూ దందా కొనసాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో సర్పంచ్‌పై 9 కేసులు నమోదు కాగా, పోలీసులు అరెస్ట్ చేశారు. […]
దిశ ప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న బొమ్మకల్ గ్రామంలో దాదాపు రూ. వంద కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు హాంఫట్ అయ్యాయి. బొమ్మకల్ శివారులో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉండగా, కబ్జాదారులు వాటిని యథేచ్చగా అమ్మేసుకుంటున్నారు. గ్రామ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే గ్రామంలో భూ దందా కొనసాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో సర్పంచ్‌పై 9 కేసులు నమోదు కాగా, పోలీసులు అరెస్ట్ చేశారు.
కరీంనగర్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న బొమ్మకల్ గ్రామంలో భూముల రేటుకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను పడింది. దీంతో సర్కారు భూముల్లో దర్జాగా ఇండ్లు నిర్మించుకున్నా.. అడిగేవారే లేకుండా పోయారు. ఇంతపెద్ద మొత్తంలో సాగిన ఈ దందాలో సర్పంచ్ వెనక ఉన్నదెవరు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్కారు భూమి కబ్జాకు గురవుతున్న విషయాన్ని రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం ఒక ఎత్తైతే, ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయడం మరో ఎత్తు అని చెప్పొచ్చు.
సర్కార్ భూములు రిజిస్ట్రేషన్..
వాస్తవంగా ప్రభుత్వం అసైన్ చేసిన భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దన్న నిభందన ఉండగా, ఎవరికీ అలాట్ కానీ సర్కారు భూములను రిజిస్ట్రేషన్ ఎలా చేశారో అంతు చిక్కకుండా ఉంది. ప్రభుత్వ భూమి కదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే బొమ్మకల్ సర్పంచ్ నేతృత్వంలో జరిగిన ఈ భూ దందా వ్యవహారంలో అధికారుల పాత్ర కూడా కీలకంగానే మారింది. అయితే రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వ భూమలు రిజిస్ట్రేషన్ జరుగుతున్న విషయాన్ని గమనించి సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేసే ప్రయత్నం ఎందుకు చేయలేదన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. పోలీసులు బొమ్మకల్ సర్పంచ్ ను మాత్రమే బాధ్యుడిని చేసి సరిపెట్టకుండా, సమగ్ర దర్యాప్తు చేస్తే ప్రభుత్వ యంత్రాంగం ఇన్ వాల్వ్ మెంట్ కూడా వెలుగులోకి వస్తుందని పలువురు చెప్తున్నారు. దాదాపు ఈ ఏడాది జనవరి వరకు కూడా ఈ గ్రామానికి చెందిన భూముల రిజిస్ట్రేషన్ల స్కాం జరిగినట్లు తెలుస్తోంది. కేవలం బొమ్మకల్ గ్రామమే కాకుండా నగరాన్ని ఆనుకుని ఉన్న సీతారాంపూర్ గ్రామంలో బై నెంబర్ల దందా కొనసాగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ గ్రామ శివార్లలోని ఓ సర్వే నెంబర్ పక్కా ప్రభుత్వ భూమి అని తెలిసినా దర్జాగా స్థానికులు ఇళ్ల నిర్మాణం చేసుకున్పారు. ప్రభుత్వ భూమి అని కాకుండా సర్వే నెంబర్ కు బై నెంబర్ జోడించి పంచాయతీలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినా పట్టించుకున్నవారే లేకుండా పోయారన్న ఆరోపణలు ఉన్నాయి.
డ్యాంలో మునిగిన సర్వే నెంబర్లు…
కరీంనగర్‌కే తలమానికంగా ఉన్న లోయర్ మానేరు డ్యాం నిర్మించినప్పుడు కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బాధిత రైతులు పరిహారం కూడా తీసుకుని వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. అయినప్పటికీ ఆ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు వేసి మరీ కరీంనగర్ శివార్లలోని భూములు అమ్ముకున్న ఘనలూ ఉన్నారు. ప్రధానంగా హస్నాపురం, యాస్వాడ, ఎలగందుల తదితర గ్రామాలకు చెందిన భూములు ఎల్ఎండీలో ముంపునకు గురి కాగా, ఆ భూముల సర్వే నెంబర్లు వేసి కరీంనగర్, సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లోని భూమిని దర్జాగా అమ్మేసుకున్న వారూ లేకపోలేదు.
హెచ్‌ఆర్‌సీ సీరియస్
కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో జరిగిన భూ అక్రమాలపై హెచ్‌ఆర్‌సీ సీరియస్‌గా తీసుకుంది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్‌లో అరెస్ట్ అయిన బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్‌పై ఎలాంటి కేసులు నమోదు చేశారో తెలపాలని ఆదేశించింది. నీటి వనరుల కబ్జా, ప్రభుత్వ భూముల ఆక్రమణ వివరాలు పంపాలని, ప్రధానంగా నీటి వనరుల ఎఫ్టీఎల్ వివరాలు పంపించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలు కూడా పంపాలని పేర్కొంది.