ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ.. జాబితా కోసం ఎదురుచూపులు
దిశ, కరీంనగర్ సిటీ: ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానికత, సీనియారిటీకే ప్రాధాన్యతనిస్తుండటంతో, సీరియల్ నెంబర్, జిల్లా కేటాయింపుపై వారిలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సీనియారిటీ జాబితా సిద్ధం చేసినా, దానిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అన్ని సంఘాలతో కలెక్టర్ ఆదివారం రాత్రి పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఆయా సంఘాల నేతలు వెల్లడించిన అభ్యంతరాలు పరిశీలించి, సరిదిద్దే పనిలో విద్యాశాఖ యంత్రాంగం నిమగ్నమైంది. పూర్తి కాగానే తుది జాబితాను కలెక్టర్‌కు అంజేయనున్నారు. ఆయన పరిశీలించిన వెంటనే […]
దిశ, కరీంనగర్ సిటీ: ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానికత, సీనియారిటీకే ప్రాధాన్యతనిస్తుండటంతో, సీరియల్ నెంబర్, జిల్లా కేటాయింపుపై వారిలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సీనియారిటీ జాబితా సిద్ధం చేసినా, దానిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అన్ని సంఘాలతో కలెక్టర్ ఆదివారం రాత్రి పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఆయా సంఘాల నేతలు వెల్లడించిన అభ్యంతరాలు పరిశీలించి, సరిదిద్దే పనిలో విద్యాశాఖ యంత్రాంగం నిమగ్నమైంది. పూర్తి కాగానే తుది జాబితాను కలెక్టర్‌కు అంజేయనున్నారు. ఆయన పరిశీలించిన వెంటనే జాబితా విడుదల చేసి, ఆన్లైన్‌లో ప్రదర్శించనున్నారు. ఇదంతా పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం జిల్లాలు కేటాయించి, ఆ వెంటనే బదిలీ ఉత్తర్వులు అందజేయనున్నారు. ఈ క్రమంలో తమ సీరియల్ నెంబర్ ఆధారంగా ఏ జిల్లాకు బదిలీ అయ్యే అవకాశముందో తెలుసుకునేందుకు, సీనియారిటీ జాబితా కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు.
బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులు వారం రోజులలో వారు బదిలీ అయిన స్థానంలో రిపోర్ట్ చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నో ఏళ్లుగా పట్టణాలు, నగరాలు, వాటి పరిసర ప్రాంతాలలో ఉద్యోగం నిర్వహించిన వారంతా, తాజాగా సీనియార్టీ, ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపడుతుండటంతో, తమను ఎక్కడికి బదిలీ చేస్తారో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నూతన జిల్లాలో 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ జిల్లాను స్థానికంగా పరిగణించి, బదిలీ చేయాలని డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం సీనియార్టీనే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతి పొందిన నాటి నుంచి వారికి ఉన్న సీనియార్టీని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నది. దీంతో, ఉపాధ్యాయుల్లో ఇన్నాళ్లుగా ఉన్న స్థానికత ధీమా సడలి, బదిలీలలో ఎక్కడ పోస్టింగ్ వస్తుందోననే ఆందోళన జూనియర్లలో వ్యక్తమవుతోంది.