అనుకోకుండా లిఫ్ట్‌లో కలిసిన ఉద్ధవ్ ఠాక్రె, దేవేంద్ర ఫడ్నవీస్
లిఫ్ట్ కోసం వేచి ఉన్న సమయంలో వారిద్దరూ పలకరించుకోవడమే కాకుండా కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. మొదటిరోజు సమావేశాల సందర్భంగా చిరకాల ప్రత్యర్థులు ఉద్ధవ్ ఠాక్రె, దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ కలిసి లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లిఫ్ట్ కోసం వేచి ఉన్న సమయంలో వారిద్దరూ పలకరించుకోవడమే కాకుండా కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. అయితే, ఏ విషయం గురించి మాట్లాడుకున్నారనే దానిపై స్పష్టత లేదు, కానీ కీలక అంశాల గురించే చర్చించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీని గురించి ఉద్ధవ్ ఠాక్రెను మీడియా ప్రతినిధులు అడగ్గా.. 'ఇకమీదట తమ రహస్య సమావేశాలన్నీ లిఫ్ట్‌లోనే పెట్టుకుంటామని సరదాగా వ్యాఖ్యానించారు. దేవేంద్ర ఫడ్నవీస్, నేను ఒకే లిఫ్ట్‌లో ఉన్నప్పుడు, చాలామంది చాలా రకాలుగా భావిస్తున్నారు. కాన్నీ అలాంటిదేమీ అక్కడ లేదు. అనుకోకుండా మేమిద్దరం కలిశామంతే' అని ఠాక్రె వివరించారు. కాగా, గురువారం నుంచి మొదలైన మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా.. శుక్రవారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండె ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇవి చివరి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు. దాంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.