బెంగాల్‌లో దీదీ పార్టీ క్లీన్ స్వీప్.. రెండో స్థానంలో బీజేపీ

పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) క్లీన్ స్వీప్ చేసింది.

Update: 2023-07-12 13:32 GMT

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకుగానూ 34,359 స్థానాలను టీఎంసీ గెలుచుకుంది. మరో 752 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దాని సమీప ప్రత్యర్థి బీజేపీ 9,545 స్థానాల్లో విజయం సాధించి, ఇంకో 180 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  సీపీఐ(ఎం) 2,885 స్థానాల్లో విజయం సాధించి 96 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2,498 స్థానాల్లో విజయం సాధించి, 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎలక్షన్స్ జరగడంతో కౌంటింగ్ బాగా లేట్ అవుతోంది. బుధవారం అర్ధరాత్రి కల్లా మొత్తం రిజల్ట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో తమకు భారీ విజయం అందించిన పశ్చిమ బెంగాల్ ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. 

పార్టీలకు అతీతంగా ఎన్నికల హింసలో మరణించిన 19 మంది బంధువులకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరికి హోంగార్డు ఉద్యోగం ఇస్తామన్నారు. మరోవైపు మాజీ న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని బీజేపీ నిజనిర్ధారణ బృందం బుధవారం కోల్‌కతాకు చేరుకొని హింసాత్మక ప్రాంతాలను సందర్శించింది. దీనిపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ.. "మణిపూర్ మండు తున్నప్పుడు నిజనిర్ధారణ బృందం ఎక్కడ ఉంది..? ఎన్‌ఆర్‌సి కారణంగా అస్సాం మండుతున్నప్పుడు ఈ బృందం ఎక్కడ ఉంది..? ఎన్ని కమీషన్లు ఈ ప్రదేశాలను సందర్శించాయి..? 2 సంవత్సరాలలో దాదాపు 154 బృందాలు పశ్చిమ బెంగాల్‌ను సందర్శించాయి. ఇవి బీజేపీ రెచ్చగొట్టే కమిటీలు, నిజనిర్ధారణ కమిటీలు కాదు" అని కామెంట్ చేశారు.


Similar News