నేరాలను ప్రోత్సహిస్తున్నారా ? : ఎక్స్ పై భారత్ మండిపాటు

ఎక్స్ లో బెదిరింపులు పోస్ట్ చేస్తుంటే ఏం చేస్తున్నారని ఎక్స్ ప్రతినిధులను భారత్ ప్రశ్నించింది. ఇందుకు సరైన వివరణ ఇవ్వాలని మంత్రి భోండ్వే కోరారు.

Update: 2024-10-23 07:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల వారంరోజుల్లో 100 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన క్రమంలో.. ప్రముఖ సోషల్ మీడియా వేదికైన X పై భారత ప్రభుత్వం మండిపడింది. బుధవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంకేత్ ఎస్ భోండ్వే (Sanket S Bhondve).. ఎక్స్(X), మెటా(Meta) వంటి సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భోండ్వే ఎక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులు పోస్టు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎక్స్ తీరు చూస్తుంటే ఇలాంటి నేరాలను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అలాంటి వాటిని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఎక్స్ ప్రతినిధులను భోండ్వే కోరారు.

కొన్నిరోజులుగా దేశానికి చెందిన విమానయాన సంస్థలు 120కి పైగా బాంబు బెదిరింపులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మంగళవారం కూడా ఇండిగో(Indigo), విస్తారా(Vistara), ఎయిర్ ఇండియా(Air India) కు చెందిన 30 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. అధికారులు అప్రమత్తమై.. ప్రోటోకాల్ ను పాటించారు.

సోమవారం (అక్టోబర్ 21) పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిని నో ఫ్లై లిస్టులో చేర్చడంతో పాటు.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పౌర విమానయాన భద్రత చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న చట్టవిరుద్ధమైన పనులను అణచివేసేందుకు చట్టాన్ని సవరించేలా ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. ఇందుకోసం ఇతర మంత్రిత్వ శాఖలతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉందని, కచ్చితంగా మార్పులు చేస్తామని తెలిపారు. ఈ బెదిరింపుల వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోందని, పూర్తయ్యాక అన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. 


Similar News