వయానాడ్‌కు ఇద్దరు ఎంపీలు: ప్రియాంకకు మద్దతుగా రాహుల్ గాంధీ

వయానాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు.

Update: 2024-10-23 09:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వయానాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. వయానాడ్ ప్రజలతో తనకున్న అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలుసని, వయానాడ్ తనకు చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని రాహుల్ అన్నారు. దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక నియోజకవర్గం వయానాడ్ అని, ఒకరు అధికారికంగా, మరొకరు అనధికార ఎంపీగా ఈ నియోజకవర్గానికి ఉంటారని తెలిపారు. వీరిద్దరూ వయానాడ్ ప్రజల కోసం పని చేస్తారని చెప్పారు. ప్రియాంక గాంధీ కట్టిన రాఖీని తాను ఎప్పటికీ తీసేయనని, సోదరిని ఎల్లప్పుడూ రక్షిస్తామని చెప్పడానికి అది ఒక సంకేతమని తెలిపారు. వయానాడ్ ప్రజలు కూడా తన సోదరిని రక్షించి, ఆమెను ఆశీర్వదించాలని కోరారు. వయానాడ్ ప్రజల కోసం ఆమె శాయశక్తుల పని చేస్తుందన్నారు. తాను వయానాడ్‌కు అనధికార ఎంపీనని, తాను ఎల్లప్పుడూ ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటానని వివరించారు.

35 ఏళ్లుగా ప్రచారం చేశా:

17 ఏళ్ల వయసు నుంచి తాను ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు ప్రియాంక గాంధీ తెలిపారు. తొలిసారిగా తన తండ్రి(మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) కోసం ఎన్నికల క్యాంపెయినింగ్ చేశానని వివరించారు. ‘ఆ తర్వాత నా తల్లి, సోదరుడు, పార్టీ నాయకుల కోసం ప్రచారం చేశాను. 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం చేస్తూనే ఉన్నాను. కానీ, తొలిసారి ఇప్పుడు నా కోసం నేను ప్రచారం చేస్తున్నాను. ఇది కొత్తగా ఉన్నది’ అని ప్రియాంక గాంధీ అన్నారు. వయానాడ్ ఉపఎన్నికలో పోటీ చేయడానికి అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. ‘మీకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని ఇవ్వండి. వయానాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తాను’ అని వివరించారు.

Tags:    

Similar News