ఫార్చ్యూనర్‌ కారులో యువకుడు సజీవదహనం.. ప్రీ ప్లాన్డ్ మర్డరేనా..? (వీడియో)

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ యువకుడు అత్యంత దారుణంగా సజీవ దహనం అయ్యాడు.

Update: 2024-10-23 09:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ యువకుడు అత్యంత దారుణంగా సజీవ దహనం అయ్యాడు. రోడ్డుకు దూరంగా ఫార్చ్యూనర్‌ కారులో అనుమానస్పదంగా మంటల్లో కాలిపోయాడు. అతడిని కాపాడాలని స్థానికులు చేసిన ప్రయత్నం విఫలమయింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రేటర్ నోయిడాలోని దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ పుల్ నాగ్లా రోడ్డకు 100 మీటర్ల దూరంలో ఓ ఫార్చ్యూనర్ కారు అగ్నికి ఆహుతి అవుతూ స్థానికులకు కనిపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న ప్రజలు కారులో ఓ వ్యక్తి సజీవ దహనం అవుతుండటాన్ని గమనించి అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ కారుకు అప్పటికే మంటలు దట్టంగా అములుకోవడంతో స్థానికుల ప్రయత్నం నిష్ప్రయోజనం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి కారులో ఉన్న యువకుడిని బయటకు తీశారు. కానీ అప్పటికే అతడు మృతిచెందాడు.

పోలీసుల దర్యాప్తులో మృతుడు ఘజియాబాద్‌లోని నెహ్రూ నగర్‌కు చెందిన సంజయ్ యాదవ్‌గా గుర్తించారు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కాగా, మంగళవారం సైట్ చూడటానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన ఫార్చ్యూనర్‌ కారులో బయలుదేరాడు. అయితే అతడితోపాటు ఇద్దరు మిత్రులు కూడా కారులో ఉన్నట్లు సంజయ్ యాదవ్‌ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారిద్దరే తమ కుమారుడిని హత్యచేసి సజీవ దహనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురి మధ్య ఆభరణాల విషయంలో గొడవ జరిగిందని ఈ నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఫార్చ్యూనర్‌ కారు కూడా రోడ్డుకు 100 మీటర్ల దూరంలో ఉండటంతో ప్రీ ప్లాన్డ్ మర్డర్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సంజయ్ యాదవ్‌ సజీవ దహనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


Similar News