మీ మౌళిక సదుపాయాల వాదనలకు ఉదాహారణలు ఇవే!.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే

మోడీ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, నేరపూరిత నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని, అవినీతి, పనికిమాలిన, స్వార్ధపూరిత ప్రభుత్వ భారాన్ని వారు మోశారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Update: 2024-06-28 09:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మోడీ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, నేరపూరిత నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని, అవినీతి, పనికిమాలిన, స్వార్ధపూరిత ప్రభుత్వ భారాన్ని వారు మోశారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఢిల్లీ విమానాశ్రయ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఖర్గే.. మృతులకు సంతాపం తెలియజేశారు. గడచిన 10 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో నాసిరకం మౌలిక సదుపాయాలు పేక మేడళ్లా పడిపోవడానికి అవినీతి, నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కూలిపోవడం, జబల్‌పూర్ విమానాశ్రయం పైకప్పు కూలిపోవడం, అయోధ్య కొత్త రోడ్ల దయనీయ పరిస్థితి, రామమందిరం లీకేజీ, ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు, 2023 నుంచి 2024 మధ్య బీహార్‌లో 13 కొత్త వంతెనలు కూలిపోవడం, ప్రగతి మైదాన్ టన్నెల్ మునిగిపోవడం, గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన విషాదం లాంటివి "ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు" సృష్టించామని మోడీ జీ, బీజేపి చేసిన పెద్ద వాదనలను బహిర్గతం చేసే కొన్ని ఖచ్చితమైన ఉదాహరణలు! అని తెలిపారు.

మార్చి 10న, మోదీ జీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టీ వన్ ని ప్రారంభించినప్పుడు, తనను తాను "దూస్రీ మిట్టి కా ఇన్సాన్.." అని పిలిచుకున్నారని, ఈ తప్పుడు ధైర్యసాహసాలు, వాక్చాతుర్యం ఎన్నికలకు ముందు త్వరగా రిబ్బన్ కటింగ్ వేడుకలలో పాల్గొనడానికి మాత్రమే పనికి వస్తాయని ఎద్దేవా చేశారు. ఇక ఢిల్లీ విమానాశ్రయ దుర్ఘటనలో మృతులకు మా హృదయపూర్వక సంతాపం తెలుపుతూ.. అవినీతి, పనికిమాలిన, స్వార్థపూరిత ప్రభుత్వం చేసిన పనికి వారు బలయ్యారని ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.


Similar News