Tel Aviv: టెల్ అవీవ్‌పై హిజ్బుల్లా దాడి.. నిలిచిపోయిన పలు విమానాలు

గాజా, బీరూట్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా.. టెల్ అవీవ్‌పై లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ దాడి చేసింది.

Update: 2024-10-22 10:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గాజా, బీరూట్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా.. తాజాగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ దాడి చేసింది. క్షిపణులతో భారీ దాడులకు పాల్పడింది. టెల్ అవీవ్ శివార్లలోని ఇంటెలిజెన్స్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది. అలాగే ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంలో ఉన్న నావికా స్థావరంపైనా రాకెట్లను ప్రయోగించినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. టెల్ అవీవ్‌పై క్షిపణులను ప్రయోగించడంతో బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం కలిగినట్టు సమాచారం.

ఈ దాడులను ఇజ్రాయెల్ సైతం ధ్రువీకరించింది. లెబనాన్ నుంచి క్షిపణులు రాగా వాటిలో కొన్నింటిని అడ్డుకోగా మరికొన్ని బహిరంగ ప్రదేశాల్లో పడిపోయినట్టు వెల్లడించింది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇజ్రాయెల్ 24 గంటల్లో లెబనాన్‌లోని 300 హిజ్బుల్లా లక్ష్యాలపై దాడిచేసిన ఒక రోజు తర్వాత టెల్ అవీవ్ పై దాడులు జరగడం గమనార్హం. అంతేగాక అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిజ్బుల్లా దాడులు చేయడం ఆందోళనకరంగా మారింది.

దక్షిణ బీరూట్‌లో 13 మంది మృతి

దక్షిణ బీరూట్‌లోని రఫిక్ హరిరి ఆస్పత్రి సమీపంలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఓ చిన్నారితో సహా 13 మంది మరణించినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 57 మంది గాయపడ్డట్టు వెల్లడించింది. ఆస్పత్రి పరిసరాల్లోని నాలుగు భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని పేర్కొంది. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకోగా వారి కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దీంతో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాదాపు నెల రోజుల పాటు జరిగిన యుద్ధంలో లెబనాన్‌లో సుమారు 1,489 మంది మరణించినట్టు అంచనా వేసింది. 


Similar News