Sebi chief: సెబీ చీఫ్ పై ఆరోపణలు.. క్లీన్ చీట్ ఇచ్చిన కేంద్రం

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్ బోర్డు (SEBI) చీఫ్ మాధబి పురి బుచ్‌ (Madhabi Puri Buch)కు కేంద్రం క్లీన్ చీట్ ఇచ్చింది.

Update: 2024-10-22 10:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్ బోర్డు (SEBI) చీఫ్ మాధబి పురి బుచ్‌ (Madhabi Puri Buch)కు కేంద్రం క్లీన్ చీట్ ఇచ్చింది. వరుస వివాల్లో చిక్కుకున్న ఆమెకు ఊరట దక్కినట్లైంది. సెబీ చీఫ్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ వచ్చిన ఆరోపణల కేసులో ఆమెకు కేంద్రం క్లీన్ చీట్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఆరోపణల వ్యవహారంపై పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ ఇటీవల చేపట్టిన దర్యాప్తు ముగిసింది. అయితే, మాధబి (Madhabi Puri Buch) గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినట్లుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పినట్లు సమాచారం. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, మాధబి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

సెబీ చీఫ్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలు

ఇకపోతే, సెబీ చీఫ్ పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఆ తర్వాత ఆమెపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి. సెబీ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని, ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వేతనం అందుకున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అంతేగాక, మాధబి భర్తకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్‌తో సెబీకి సంబంధాలున్నాయని ఆరోపణలు చేసింది. అయితే, అవన్నీ తప్పుడు ఆరోపణలని ఆమె పేర్కొన్నారు. దీనిపైనే, పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ దర్యాప్తు చేపట్టింది.


Similar News