Kalyan benarjee: జేపీసీ సమావేశంలో ఉద్రిక్తత.. టీఎంసీ ఎంపీ సస్పెండ్

వక్ఫ్ బిల్లుపై చర్చించేందుకు పార్లమెంటు హాలులో మంగళవారం జాయింట్ పార్టమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశం ఏర్పాటు చేశారు.

Update: 2024-10-22 11:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ బిల్లుపై చర్చించేందుకు పార్లమెంటు హాలులో మంగళవారం జాయింట్ పార్టమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లుపై చర్చ జరుగుతుండగా బీజేపీ ఎంపీ అబిజిత్ గంగోపాధ్యాయ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన కళ్యాణ్ తన పక్కనే ఉన్న గాజు గ్లాసును టేబుల్‌పై విసిరేశారు. దీంతో ఆయన కుడి చేతికి గాయమైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీకి చెందిన జగదాంబిక పాల్ నేతృత్వంలోని కమిటీ సమావేశంలో భాగంగా రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయవాదుల బృందం అభిప్రాయాలను వింటోంది. ఈ క్రమంలో కళ్యాణ్ బెనర్జీ పలు మార్లు అడ్డుతగిలారు. తన వంతు కంటే ముందే మాట్లాడతానని పట్టుబట్టాడు.

అయితే దీనిని అభిజిత్ వ్యతిరేకించారు. అనంతరం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరు ఎంపీలు పరస్పరం దుర్భాషలాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గాజు గ్లాసును పగుళగొట్టిన బెనర్జీ దానిని చైర్మన్ కుర్చీ వైపు విసిరేశారు. దీంతో ఆయన వేలుకు గాయమైంది. అనంతరం పలువురు ఎంపీలు కళ్యాణ్ బెనర్జీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన తర్వాత సభ కూడా కొంతసేపు నిలిచిపోయింది. బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్‌ను జేపీసీ చైర్‌పర్సన్‌గా తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు సమావేశాన్ని బహిష్కరించారు. జేపీసీ కమిటీ సూత్రాలు, నిబంధనల ప్రకారం పనిచేయనందున మీటింగ్ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు తెలిపారు.

కళ్యాణ్ బెనర్జీ సస్పెండ్ !

జేపీసీ సమావేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎంపీ కల్యాణ్ బెనర్జీని ఒకరోజు సస్పెండ్ చేశారు. నిషికాంత్ దూబే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా 9 మంది సభ్యులు అనుకూలంగా, 8 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అనంతరం బెనర్జీని సస్పెండ్ చేస్తూ జేపీసీ చైర్‌పర్సన్ జగదాంబికా పాల్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆయన తదుపరి సమావేశానికి హాజరు కాలేరు. సమావేశంలో అనుచితంగా ప్రవర్తించినందుకే చర్యలు తీసుకున్నట్టు దూబే తెలిపారు. కాగా, వక్ఫ్ (సవరణ) బిల్లును ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టగా, విపక్షాల అభ్యంతరాల మధ్య జేపీసీకి పంపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల మొదటి వారంలో కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించాల్సి ఉంటుంది.


Similar News