Supreme court: హిందుత్వ పదాన్ని భారత రాజ్యాంగవాదంతో భర్తీ చేయాలి.. పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

హిందుత్వ అనే పదాన్ని భారత రాజ్యాంగవాదంతో భర్తీ చేయాలంటూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Update: 2024-10-21 09:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిందుత్వ అనే పదాన్ని భారత రాజ్యాంగవాదంతో భర్తీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీలోని వికాస్‌పురికి చెందిన ఎస్‌ఎన్‌ కుంద్రా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ అభ్యర్థనను స్వీకరించలేమని తెలిపింది. ఇది న్యాయ ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. కాగా, హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణను ప్రోత్సహించే భావజాలాన్ని సూచించే హిందుత్వ పదం రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. అయితే, సుప్రీంకోర్టు తన కొన్ని తీర్పులలో ఈ భావనను ప్రస్తావించింది. 1995లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే చేసిన ప్రసంగాలపై ఒక కేసులో తీర్పును వెలువరిస్తూ హిందుత్వను జీవన విధానంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 1995 నాటి ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ 2016లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే హిందుత్వ అర్థం గురించి విస్తృత చర్చలో పాల్గొనబోమని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కుంద్రా పిల్ వేయగా తిరస్కరించింది.


Similar News