Arvind Kejriwal: ఆప్ నేత కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేత

ఆప్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది.

Update: 2024-10-21 12:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆప్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ప్రధాని నరేంద్ర మోడీకి నకిలీ డిగ్రీ ఉందని చేసిన వ్యాఖ్యలపై గుజారాత్ యూనివర్సిటీ కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేసింది. దీంతో ఆయన తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఇటీవలే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇవాళ ఆయన పిటిషన్‌‌పై జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ద్విసభ్య ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆయనపై పరువు నష్టం కేసు విచారణ యథావిధిగా కొనసాగనుంది.

కాగా, గుజరాత్ యూనివర్సిటీ వేసిన పరువు నష్టం కేసులో భాగంగా అక్కడి పోలీసులు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇక చేసేదేమి లేక చిట్టచివరగా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా, ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కూడా కేజ్రీ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు.

ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీని గుజరాత్ యూనివర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. అసలు ఆ డిగ్రీ డూప్లికేటా.. ఒరిజినలా అని వాదించారు. తన క్లయింట్ సర్టిఫికేట్‌ గురించి ప్రశ్నిస్తే.. అందులో యూనివర్సిటీ పరువు పోయేంత విషయం ఏముందని అన్నారు. మరోవైపు గుజరాత్ యూనివర్సిటీ తరఫున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సంజయ్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును కోర్టుకు వివరించారు. దీంతో ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు పరువు నష్టం కేసు విచారణను కొనసాగించాలని తీర్పునిచ్చింది.


Similar News