Akhilesh Yadav: బహ్రైచ్ అల్లర్లు బీజేపీ కుట్రే.. అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణ
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా ఇటీవల అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రణాళిక ప్రకారమే హింస జరిగిందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు సృష్టించారని తెలిపారు. సోమవారం ఆయన యూపీలోని మెయిన్‌పురిలో ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపీస్తున్న వేళ బీజేపీ కుట్రలకు తెరలేపిందన్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు వారి వద్ద ఎలాంటి సమాధానం లేదని అందుకే హింసకు పాల్పడ్డారని చెప్పారు.
తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్న ప్రభుత్వం బహ్రైచ్‌లో పోలీసు బలగాలను ఎందుకు మోహరించలేదని ప్రశ్నించారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు మాత్రమే అల్లర్లు క్రియేట్ చేశారని ఆరోపించారు. కాగా, మహారాజ్‌గంజ్‌లోని ప్రార్థనా స్థలం వెలుపల నిమజ్జనం సందర్భంగా వివాదం చెలరేగడంతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రామ్ గోపాల్ మిశ్రా అనే యువకుడు మరణించాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాదాపు 1000 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మిశ్రాను హత్య చేసిన ఇద్దరు నిందితులు నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్చి చంపారు.