Devendra Fadnavi : విద్యార్థి నేత నుంచి అగ్రనేత స్థాయికి దేవేంద్ర ఫడ్నవిస్
దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavi) మరోసారి మహారాష్ట్ర సీఎం(Maharashtra CM) కాబోతున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavi) మరోసారి మహారాష్ట్ర సీఎం(Maharashtra CM) కాబోతున్నారు. దీనిపై మహాయుతి కూటమి నుంచి అధికారిక ప్రకటన వెలువడటం ఇక లాంఛనమే. ఎందుకంటే.. సీఎం రేసు నుంచి ఇప్పటికే ఏక్‌నాథ్ షిండే తప్పుకున్నారు. అజిత్ పవార్ మద్దతు ఫడ్నవిస్‌కే ఉంది. గురువారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జరిగిన సమావేశంలో ఈ ముగ్గురు నేతలు పాల్గొన్నారు. ఫడ్నవిసే తదుపరి సీఎం అవుతారని అమిత్ షా తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయి. షిండేకు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖను, అజిత్ పవార్‌కు ఆర్థిక శాఖను కేటాయిస్తారని సమాచారం.
దేవేంద్ర ఫడ్నవిస్ గురించి..
దేవేంద్ర ఫడ్నవిస్ రాజకీయ ప్రస్థానం 1989లో ఏబీవీపీలో విద్యార్థి నేతగా మొదలైంది. ఆయన 22 ఏళ్ల వయసులోనే నాగ్‌పూర్‌లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1997లో నాగ్‌పూర్ మేయర్‌గా ఎంపికయ్యారు. 1999లో తొలిసారిగా నాగ్‌పూర్ సౌత్‌వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఫడ్నవిస్ గెలిచారు. ఆయనపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోడీ, అమిత్ షాలకు విశ్వాస పాత్రుడిగా ఫడ్నవిస్‌కు పేరుంది. 2014లో మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంలో ఫడ్నవిస్ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో మహారాష్ట్ర సీఎంగా ఆయనకే మోడీ అవకాశాన్ని కల్పించారు. మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన బ్రాహ్మణ వర్గానికి చెందిన రెండో నేతగా ఆయన రికార్డును సాధించారు.అంతకుముందు బ్రాహ్మణ వర్గానికి చెందిన శివసేన నేత మనోహర్ జోషి మహారాష్ట్ర సీఎంగా సేవలు అందించారు.