లైవ్ స్ట్రీమింగ్‌లో సుప్రీంకోర్టు విచారణలు
సుప్రీంకోర్టు కేసుల దర్యాప్తును ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే సౌకర్యం ఏర్పడింది. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనంలో జరిగే కేసులకు మాత్రమే ఇది పరిమితమైంది.
దిశ, తెలంగాణ బ్యూరో: సుప్రీంకోర్టు కేసుల దర్యాప్తును ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే సౌకర్యం ఏర్పడింది. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనంలో జరిగే కేసులకు మాత్రమే ఇది పరిమితమైంది. ఇంకా సొంతంగా ఆన్‌లైన్ నెట్‌వర్క్ వ్యవస్థను ఏర్పాటుచేసుకోనందున యూ ట్యూబ్ ద్వారా మాత్రమే అందజేస్తున్నది. కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు చూసే వీలు కల్పించాలన్న చర్చ సుప్రీంకోర్టులో చాలా కాలంగా ఉన్నప్పటికీ చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ పదవీ విరమణ చేయడానికి ముందు అమల్లోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొత్త సీజే ఉదయ్ ఉమేష్ లలిత్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ప్రత్యక్ష ప్రసారంలో కేసుల విచారణకు జడ్జీలు సహా బార్ కౌన్సిల్ కూడా సమ్మతి వ్యక్తం చేయడంతో గాడిలో పడింది.
ఆర్థికంగా బలహీనవర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించే కేసు, శివసేన పార్టీ ఏ వర్గానికి చెందుతుంది, అఖిల భారత స్థాయిలో బార్ ఎగ్జామ్ చెల్లుబాటు తదితరాలపై జరిగే విచారణలు మంగళవారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే వీలు ఏర్పడింది. థర్డ్ పార్టీకి చెందిన యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడంలో ఉన్న భద్రతాపరమైన అంశాలను గతంలో బీజేపీ నేత గోవిందాచార్య తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి వెబ్‌కాస్ట్ పై కాపీరైట్ హక్కులను యూట్యూబ్ కోరినందున సొంత వ్యవస్థను వినియోగించుకోవడం శ్రేయస్కరమంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ త్వరలో సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు క్లారిటీ ఇచ్చి తదుపరి విచారణను వచ్చే నెల 17కు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారాలకు 2018లోనే రాజ్యాంగపరమైన చిక్కులు తొలగిపోయాయి. సాంకేతిక అంశాలతో పాటు లీగల్ చిక్కులపైనా అప్పటి అటార్నీ జనరల్ వేణుగోపాల్‌తో సుప్రీంకోర్టు, ప్రభుత్వం సంప్రదింపులు జరిపాయి. ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రత్యక్ష ప్రసారం ద్వారా విచారణకు అనుమతి ఇవ్వవచ్చని సూచించారు. చివరకు గతేడాది చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ దీనిపై కసరత్తు చేసి గత నెలలో ఆచరణలోకి వచ్చింది.