‘లోక్‌సభలో విపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ ఇష్టం’
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభలో విపక్ష నేత ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభలో విపక్ష నేత ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో విపక్ష నేత నియామకంపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మహారాష్ట్రలోని పూణె జిల్లా బారామతిలో పవార్ విలేకరులతో మాట్లాడుతూ, లోక్‌సభలో విపక్ష నేత నియామకం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఇండియా కూటమిలో కాంగ్రెస్ 99 సీట్లతో ఎక్కువ స్థానాలు దక్కించుకుని పెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో ఆ పదవి ఎవరికి ఇవ్వాలో కాంగ్రెస్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా ప్రతిపక్షం నుండి ఎవరైనా ఉండేలా ప్రయత్నాలు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా , గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ దీనిని పాటించలేదని అన్నారు. ఒకవేళ.. ఈ అంశంపై చర్చ జరిగిన కూడా ఎలాంటి సానుకూల ఫలితం వస్తుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) విజయంపై మాట్లాడిన పవార్, ప్రజలు పీఎం మోడీపై విశ్వాసం కోల్పోయారని, ఆయన హామీ బూటకమైందని పవార్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ 30 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలతో కూడిన అధికార మహాయుతికి 17 సీట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే లోక్‌సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తూ సీడబ్ల్యూసీ ఇటీవల ఏకగ్రీవంగా ఆమోదించగా, ఇంకా రాహుల్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.