Biswa Sarma: బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి.. అసోం సీఎం బిస్వ శర్మ
బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాలు చొరబాట్లపై చర్యలు తీసుకోకపోతే అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని బిస్వ శర్మ హెచ్చరించారు.
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్(Bangladesh)తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు చొరబాట్లపై చర్యలు తీసుకోకపోతే అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అసోం సీఎం హిమంత బిస్వ శర్మ(Himantha biswa sharma) హెచ్చరించారు. రోహింగ్యా ముస్లిం(Rohingya muslims)ల చొరబాట్లను నిరోధించడానికి బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(BSF)తో సన్నిహిత సహకారం అవసరమని నొక్కి చెప్పారు. ఆదివారం ఆయన గువహటి (Guwahati)లో మీడియాతో మాట్లాడారు. చొరబాట్లపై అసోం(Assam), త్రిపుర(tripura) రాష్ట్రాలు చురుకుగా పని చేస్తున్నాయని అక్రమంగా చొరబడేందుకు యత్నించిన అనేక మందిని గుర్తించాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్(west bengal) ప్రభుత్వం సైతం అప్రమత్తమైతే అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు మంచి ప్రయత్నం అవుతుందని తెలిపారు.
భారత్‌లోకి చొరబడే వారిని అసోంలో అడ్డుకుంటే వారు బెంగాల్ సరిహద్దు (Bengal barder) గుండా తిరిగి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి మేఘాలయ, అసోం, త్రిపుర, బెంగాల్ ప్రభుత్వాలు బీఎస్ఎఫ్‌కు పూర్తిగా మద్దతివ్వాలని సూచించారు. బీఎస్ఎఫ్‌తో అసోం ప్రభుత్వం సహకారం అందిస్తే మంచి ఫలితాలు వచ్చాయని, గత రెండు నెలల్లోనే 138 చొరబాటుదారులను గుర్తించి అడ్డుకోగలిగామన్నారు. రోహింగ్యా ముస్లింలను మాత్రమే తాము అడ్డుకున్నామని స్పష్టం చేశారు. ‘రోహింగ్యా ముస్లింలు ఇంకా భారత్‌కు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. బీఎస్ఎఫ్‌తో సన్నిహితంగా మెలగాలి’ అని వ్యాఖ్యానించారు.