Cyclone: దూసుకొస్తున్న తుపాన్.. తమిళనాడులో భారీ వర్షాలు కురిసే చాన్స్ !
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం నాటికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం నాటికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మరో రెండు రోజుల్లో శ్రీలంక (Srilanka) తీరాన్ని దాటి తమిళనాడు (Thamilnadu) వైపు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 8.30 గంటల నాటికి త్రికోణమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 710 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయం, చెన్నయ్‌కి 800 కిలోమీటర్ల దూరంలో లోతైన అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. నవంబర్ 27న ఇది మరింత తీవ్ర మయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజుల్లోగా శ్రీలంక సముద్ర తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపుకదల నుందని, దీని ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో బలపడుతున్న తుపానులు ఆంద్రప్రదేశ్, తమిళనాడు వైపు కదులుతాయని తెలిపింది. ఈ టైంలో గంటకు 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.