worker killed: విషవాయువు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి.. గుజరాత్‌లో విషాదం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. విషవాయువు పీల్చి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ (Gujarath)లోని అహ్మదాబాద్( Ahmedabad) లో విషాదం చోటు చేసుకుంది. విషవాయువు (Toxic Fumes) పీల్చి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా..మరో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. నారోల్ పారిశ్రామిక ప్రాంతంలోని దేవి సింథటిక్స్ ఫ్యాక్టరీ(Devi Synthetic Factory)లో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఫ్యాక్టరీలోని ట్యాంక్‌లోకి యాసిడ్‌ని పంపిస్తున్నప్పుడు వెలువడిన విషపూరిత పొగలను పీల్చగా తొమ్మిది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని ఎల్‌జీ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఏడుగురు కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (Fsl), ఇండస్ట్రియల్ సేఫ్టీ, గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (gpcb) అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ చేపట్టింది. వారి నివేదిక ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకుంటారని డీసీపీ రవిమోహన్ సైనీ (Ravi mohan sainy) తెలిపారు.