China: వృద్ధాశ్రమాలుగా మారుతున్న చైనా స్కూళ్లు

2023లో ఏకంగా 14,808 కిండర్ గార్టెన్ స్కూళ్లు మూతపడ్డాయి.

Update: 2024-10-27 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చైనా గత కొంతకాలంగా అనేక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. అయితే ఇటీవల అధిక జనాభా కారణంగా డ్రాగన్ కంట్రీలో జననాల రేటు గణనీయంగా క్షీణించింది. దీనివల్ల వేలాదిగా స్కూళ్లు మూతపడుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. 2023లో ఏకంగా 14,808 కిండర్ గార్టెన్ స్కూళ్లు మూతపడ్డాయి. ప్రస్తుతం చైనాలో 2,74,400 స్కూళ్లు ఉన్నాయని చైనా విద్యా శాఖ వార్షిక నివేదికలో పేర్కొంది. చైనాలో వరుసగా రెండో ఏట జననాల రేటు పడిపోయింది. కిండర్ గార్టెన్‌లో చేరే పిల్లల సంఖ్య వరుసగా మూడో సంవత్సరం క్షీణించింది. గతేడాది 11.55 శాతం అంటే 53.5 లక్షల మంది తగ్గి 4.09 కోట్లకు చేరుకున్నారని హాంకాంగ్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ప్రాథమిక పాఠశాలల సంఖ్య కూడా 2023లో 5,645 తగ్గి 1,43,500కి 3.8 శాతం పడిపోయింది. గతేడాది దేశంలో 90 లక్షల జననాలు నమోదు కాగా 1949 తర్వాత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. దాంతో చైనా జనాభా సైతం 140 కోట్లకు తగ్గింది. జనాభా విషయంలో చైనా ఓవైపు జననాల తగ్గుదలతో పాటు వృద్ధులు పెరుగుదలను ఎదుర్కొంటోంది. గతేడాదిలో 60 ఏళ్లకు పై వయసుపైబడిన వారు 30 కోట్లు ఉన్నారు. ఈ సంఖ్య 2035 నాటికి 40 కోట్లు, 2050 కల్లా 50 కోట్లకు చేరుకోవచ్చని నివేదిక అంచనా. దాంతో మూతపడుతున్న కిండర్ గార్టెన్‌లను వృద్ధాశ్రమాలుగా మారుతున్నాయి. మూసేసిన స్కూల్ సిబ్బందికి వృద్ధులను చూసుకునే బాధ్యతలు అప్పగిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. తగ్గుతున్న జననాలు, పెరుగుతున్న వృద్ధాప్య జనాభా వ్యత్యాసాన్ని కాపాడేందుకు పెళ్లిళ్లను సులభతరం చేయాలని, విడాకుల ప్రక్రియను కఠినతరం చేయాలని చైనా భావిస్తోంది. 

Tags:    

Similar News