Assam CM: బంగ్లా అక్రమ వలసలను అడ్డుకునేందుకు బెంగాల్ సహకారం కోరిన అస్సాం సీఎం

పశ్చిమ బెంగాల్ కూడా చొరబాటుదారులను అడ్డుకునేందుకు సహకరిస్తేనే ప్రయత్నం సఫలమవుతుందని సీఎం తెలిపారు

Update: 2024-10-27 15:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు తమ మధ్య సమన్వయం చేసుకోవాలని, పొరుగు దేశంలో నెలకొన్న రాజకీయ గందరగోళం నేపథ్యంలో చొరబాట్లను అడ్డుకునేందుకు బీఎస్‌ఎఫ్‌తో సమన్వయం చేసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం అన్నారు. విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. అస్సాం, త్రిపుర ప్రభుత్వాలు ఇప్పటికే సరిహద్దు దళాలతో కలిసి పనిచేస్తున్నాయని, అయితే పశ్చిమ బెంగాల్ కూడా చొరబాటుదారులను అడ్డుకునేందుకు సహకరిస్తేనే ప్రయత్నం సఫలమవుతుందని సీఎం తెలిపారు. 'గత రెండు నెలల్లో దాదాపు ప్రతిరోజూ అస్సాం రాష్ట్రంలో విదేశీయులను పట్టుకుంటున్నాం. బీఎస్ఎఫ్ జవాన్లు ఎంత ప్రయత్నించినప్పటికీ కొంతమంది అక్రమంగా భారత్‌లోకి వస్తున్నారని' వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసదారులను ముందస్తుగా గుర్తించాలని, అస్సాం, త్రిపుర ఇప్పటికే చేస్తున్నాయని శర్మ స్పష్టం చేశారు. ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, కొంతమంది చొరబాటుదారులు భారత్‌లోని ఇతర రాష్ట్రాల ద్వారా చేరుకోగలిగారు. తమ దేశం నుంచి ఎక్కువ మందిని తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిన కొంతమంది అక్రమ వలసదారుల అరెస్టు ద్వారా ఇది స్పష్టమవుతుందన్నారు. రాష్ట్ర పోలీసులు స్వతంత్రంగా, బీఎస్‌ఎఫ్‌తో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లలో గత రెండు నెలల్లో అస్సాం నుంచి 138 మంది చొరబాటుదారులను గుర్తించి వెనక్కి పంపించారని సీఎం చెప్పారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిలో ఎక్కువగా రోహింగ్యాలే ఉన్నారు. హిందూ-బెంగాలీలు రావడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం తప్పు. సరిహద్దును పంచుకునే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. బీఎస్ఎఫ్‌తో కలిసి పనిచేయాలి' అని హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. 

Tags:    

Similar News