Supriya sule: ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయలేను.. ఈవీఎం ఇష్యూపై సుప్రియా సూలే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ(SP) నేత, లోక్ సభ ఎంపీ సుప్రియా సూలే (Supriya sule) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే తాను నాలుగు సార్లు గెలిచానని, కాబట్టి ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలూ చేయలేనని తెలిపారు. గురువారం ఆమె పూణేలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల ద్వారా ప్రజా ప్రతినిధిగా ఎన్నికై వాటిలో స్కామ్ జరుగుతుందని ఆరోపించడం సరికాదన్నారు. ఖచ్చితమైన ఆధారాలు లేనందు వల్ల ఈ అంశంపై మాట్లాడకపోవడమే సరైందని భావిస్తున్నట్టు తెలిపారు.
అయితే ఓటర్ల జాబితాపై అనేక ప్రశ్నలు ఉన్నాయని పలువురు చెబుతున్నారని, ఈవీఎంలు అయినా, బ్యాలెట్ అయినా పారదర్శకంగా పనులు జరిగితే అందులో ఎటువంటి సమస్యలూ ఉండబోవన్నారు. ప్రజలు కోరుకుంటే బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయిన ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి యుగేంద్ర పవార్ ఓట్లను మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేయడంపై సుప్రియా స్పందిస్తూ.. రీ కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేయకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. దీనికి సంబంధించిన దరఖాస్తును ఉపసహరించుకోవాలని ఆయనకు సూచించినట్టు తెలిపారు.