Karge: నెహ్రూ, గాంధీ ఐడియాలజీ కోసం చివరి శ్వాస వరకూ పోరాడతాం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ల సిద్ధాంతాలను కాపాడటానికి చివరి శ్వాస వరకూ పోరాడతామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ల సిద్ధాంతాలను కాపాడటానికి చివరి శ్వాస వరకూ పోరాడతామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge) స్పష్టం చేశారు. కర్ణాటకలోని బెలగావి(Belagavi)లో గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఖర్గే ప్రసంగించారు. ఎన్నికల కమిషన్ సహా అన్ని రాజ్యాంగ సంస్థలను బీజేపీ స్వాధీనం చేసుకోవాలనుకుంటుందని, దీనిని వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా తగ్గుతోందని, ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. 2025ని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికలలో గెలవడానికి అవసరమైన నైపుణ్యాలను పార్టీ కలిగి ఉంటుందని తెలిపారు. రాజ్యాంగం, దేశ ఆలోచనను పరిరక్షించే సైద్ధాంతికంగా నిబద్ధత ఉన్న వ్యక్తులను కనుగొంటుందని చెప్పారు. కాంగ్రెస్‌కు మహానాయకుల వారసత్వం ఉందని దానికి కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
గాంధీ వారసత్వానికి ముప్పు: సోనియా గాంధీ
దేశంలో అధికారంలో ఉన్న వ్యక్తుల నుంచి మహాత్మాగాంధీ వారసత్వానికి ముప్పు పొంచి ఉందని సోనియా గాంధీ ఆరోపించారు. సీడబ్లూసీ సమావేశానికి సోనియా గాంధీ హాజరు కానప్పటికీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ఓ లేఖ రాయగా దానిని మీటింగ్‌లో చదివి వినిపించారు. ‘ఆనాటి మహానేతలందరినీ సిద్ధం చేసి నడిపించిన వ్యక్తి మహాత్మా గాంధీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న సంస్థలు మన స్వేచ్ఛ కోసం ఎప్పుడూ పోరాడలేదు. అంతేగాక గాంధీ హంతకుడిని కీర్తిస్తున్నారు. వారి నుంచి గాంధీ వారసత్వానికి ప్రమాదం పొంది ఉంది’ అని లేఖలో పేర్కొన్నారు.
జనవరి 26 నుంచి ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్ పాదయాత్ర’
సీడబ్లూసీ సమావేశంలో కాంగ్రెస్ పలు నిర్ణయాలు తీసుకుంది. 2025 జనవరి 26 నుంచి కాంగ్రెస్ ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్ పాద యాత్ర’ చేపపట్టాని నిర్ణయించారు. 2026 జనవరి 26 వరకు ఈ యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. దీంతో పాటు పార్టీలో సమగ్ర సంస్థాగత సంస్కరణలు, పునర్నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని సమావేశంలో డిసిషన్ తీసుకున్నట్టు సీనియర్ నేత వేణుగోపాల్ తెలిపారు. 2024 డిసెంబర్ నుంచి 2026 జనవరి వరకు ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడంతో పాటు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అనే రాజకీయ ప్రచారాన్ని చేపడుతామని వెల్లడించారు. కాగా, సీడబ్లూసీ సమావేశం రెండు రోజుల పాటు జరగనుండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించంతో శుక్రవారం జరిగే అన్ని కార్యక్రమాలను కాంగ్రెస్ రద్దు చేసింది.