Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ప్రధాని నివాళులు

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) పార్థివదేహానికి ప్రదాని నరేంద్ర మోడీ(PM Modi) నివాళులర్పించారు.

Update: 2024-12-27 06:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) పార్థివదేహానికి ప్రదాని నరేంద్ర మోడీ(PM Modi) నివాళులర్పించారు. ఆయన కటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా సహా ప్రముఖులు కూడా మన్మోహన్‌ నివాసానికి చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇకపోతే, ఆర్థికాభివృద్ధికి నాంది పలికి, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిన మన్మోహన్ కు నివాళులర్పిస్తూ.. ఆయనతో కలిసి ఉన్న ఫొటోలను మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. "భారతదేశం తన అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ని కోల్పోయింది. నిరాడంబరమైన కుటుంబం నుంచి వ్యక్తి గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారు. వివిధ ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన ఆయన.. దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు. ప్రధానమంత్రిగా పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు ” అని సోషల్ మీడియా ఎక్స్ లో మోడీ పోస్ట్‌లో చేశారు.

శనివారం అంత్యక్రియలు

అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆయన పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. అంతకుముందు ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం వెల్లడించింది. ఆయన మృతికి సంతాప సూచికంగా 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ప్రస్తుతం మన్మోహన్‌ పార్థివదేహాన్ని ఆయన నివాసంలోనే ఉంచారు. ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. శనివారం రాజ్‌ఘాట్‌ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News