Senthil Balaji: తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి ఊరట.. క్యాష్ ఫర్ జాబ్ కేసులో బెయిల్ మంజూరు

తమిళనాడు మాజీ మంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) నేత సెంథిల్ బాలాజీకి భారీ ఊరట లభించింది.

Update: 2024-09-26 07:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు మాజీ మంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) నేత సెంథిల్ బాలాజీకి భారీ ఊరట లభించింది. క్యాష్ ఫర్ జాబ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో జాప్యం జరుగుతోందని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పలు షరతులతో బెయిల్ ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. వారానికి రెండు సార్లు అధికారుల ఎదుట హాజరు కావాలని, సాక్ష్యులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించొద్దని తెలిపింది. కాగా, ఏఐఏడీఎంకే హయాంలో 2011 నుంచి 2015 వరకు సెంథిల్ రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో బస్సు కండక్టర్లతో పాటు డ్రైవర్లు, జూనియర్ ఇంజనీర్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.

దీంతో గతేడాది జూన్14న మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. గతంలో మూడు సార్లు ఆయన బెయిల్ పిటిషన్‌ను చెన్నయ్ లోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. అలాగే మెడికల్ బెయిల్ కోసం తమిళనాడు హైకోర్టులో అప్పీల్ చేయగా న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

కాగా, 2018లో సెంథిల్ బాలాజీ డీఎంకేలో చేరారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపొందడంతో సీఎం స్టాలిన్ మంత్రి వర్గంలో ఆయనకు చోటు దక్కింది. అయితే బాలాజీ అరెస్ట్ అనంతరం తన పదవికి రిజైన్ చేశారు. తాజాగా బెయిల్ లభించడంపై సీఎం స్టాలిన్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన స్టాలిన్ బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు మాత్రమే ఈడీ పని చేస్తోందని ఆరోపించారు. 


Similar News