Railway: ఐదేళ్లలో రైలు ప్రమాదాల వల్ల రూ.313 కోట్లు నష్టం.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
గత ఐదేళ్లలో జరిగిన పలు రైలు ప్రమాదాల కారణంగా రూ.313 కోట్ల విలువైన రైల్వే ఆస్తులు దెబ్బతిన్నాయని ప్రభుత్వం తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: గత ఐదేళ్లలో జరిగిన పలు రైలు ప్రమాదాల(Train accidents) కారణంగా రూ.313 కోట్ల విలువైన రైల్వే ఆస్తులు (Railway preperties) దెబ్బతిన్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభ(Loke sabha)కు తెలిపింది. ‘2019 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు చోటు చేసుకున్న వివిధ రైలు ప్రమాదాల్లో ట్రాక్‌లు, మొదలైన రైల్వే ఆస్తులకు జరిగిన మొత్తం నష్టాన్ని రూ. 313 కోట్లుగా అంచనా వేశాం’ అని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini vyshnav) లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఎస్ వెంకటేశన్, సుబ్బరాయన్, పీసీ గడ్డిగౌడర్, సెల్వరాజ్, బల్వంత్ అనే ఐదుగురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
ఈ-టికెట్ల (E Tickets) ద్వారా బీమా పొందిన బాధితుల సంఖ్యకు సంబంధించిన ప్రశ్నలకు సైతం మంత్రి సమాధానమిచ్చారు. 2019 నవంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ప్రయాణ బీమా పథకం కింద 22 పాలసీలు క్లెయిమ్ చేసినట్టు తెలిపారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ (Travel insurance scheme) కింద మరణాలకు సంబంధించి ఒక్క పాలసీ కూడా క్లెయిమ్ కాలేదని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న వివిధ భద్రతా చర్యల వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. 2014-15లో 135 ప్రమాదాలు జరిగితే 2023-24 నాటికి ఆ సంఖ్య 40కి తగ్గిందని వెల్లడించారు.