ఎల్అండ్‌టీ ఛైర్మన్ 'వారానికి 90 గంటల పని' వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఎంతసేపనీ భార్యను చూస్తూ ఉంటారని ఎల్అండ్‌టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఎంతసేపనీ భార్యను చూస్తూ ఉంటారని ఎల్అండ్‌టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వ్యాపార వర్గాలతో పాటు పలువురు ప్రముఖుల నుంచి కూడా ఆయన వ్యాఖ్యలను విమర్శలు మొదలయ్యాయి. ప్రధానంగా ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఆరోగ్యంపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు పూర్తిగా ద్వేషపూరితంగా ఉన్నాయని, ఉద్యోగుల మానిసిక ఒత్తిడిని నిర్లక్ష్యం చేయడమని విమర్శించారు. ఈ వ్యవహారంపై స్పందించిన ప్రముఖ నటి దీపికా పదుకొణె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. ఎల్అండ్‌టీ ఛైర్మన్ వ్యాఖ్యలు షాకింగ్ కలిగించాయని చెబుతూ 'మెంటల్ హెల్త్ మ్యాటర్స్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టారు. అయితే, అందుకు వివరణ ఇచ్చే క్రమంలో ఎల్అండ్‌టీ కంపెనీ దేశ నిర్మాణ పట్ల నిబద్ధతను చూపేందుకే ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పడంతో, ఇలాంటి వివరణ ఇవ్వడం మరింత దిగజారేలా ఉందని దీపిక పదుకొణె కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు, వ్యాపార రంగంలోనూ దీనిపై విమర్శలు వచ్చాయి. వారంలో 90 గంటల పనా? సండేను సన్-డ్యూటీ అంటూ ఎద్దేవా చేశారు. సెలవు అనే దాన్ని ఊహాజనిత భావంగా మార్చే పని ఇది. జీవితాన్ని పూర్తిగా ఆఫీసుకే పరిమితం చేయడం వినాశనానికి దారితీస్తుంది. దానివల్ల ఎలాంటి విజయాలు ఉండవని ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా అన్నారు. మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ జ్వాలా గుత్తా సైతం.. సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను స్త్రీ ద్వేషి అని, విద్యావంతులు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించకపోవడం విచారకరమని అన్నారు. ఇక, దేశవ్యాప్తంగా కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది. ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ ఉద్యోగి మరణం వంటి సంఘటనలను చాలామంది ప్రస్తావిస్తున్నారు. ఎక్కువ పని గంటల కారణంగా ఒత్తిడి, డిప్రెషన్, తక్కువ వయసులో అనారోగ్య సమస్యలు, మరణాల గురించి ఆందోళనలు వ్యక్తమవుతోంది.