Pm modi: లావోస్‌ పర్యటనకు మోడీ.. రెండు కీలక సమావేశాలకు హాజరు

లావోస్‌లో జరిగే 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు మోడీ లావోస్‌లో పర్యటించనున్నారు.

Update: 2024-10-10 03:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆగ్నేయాసియాలోని లావోస్‌లో జరిగే 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ నేడు, రేపు లావోస్‌లో పర్యటించనున్నారు. ఆసియాన్‌కు ప్రస్తుత కన్వీనర్‌గా ఉన్న లావోస్ సోనెక్సే సిఫాండోన్ ఆహ్వానం మేరకు మోడీ సదస్సుకు హాజరుకానున్నారు. గురువారం ఉదయం లావోస్‌కు బయలు దేరిన మోడీ ఆదేశ రాజధాని వియంటియాన్‌కు చేరుకోనున్నారు. ప్రధాని పర్యటనకు ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక సమాచారాన్ని అందించింది. ఆసియాన్‌కు సంబంధించిన అన్ని యంత్రాంగాలకు భారత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది. ప్రధాని తన రెండు రోజుల పర్యటనలో లావోస్ ప్రధాన మంత్రి సోనెక్సే సిపాండన్, ఇతర నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలను సైతం నిర్వహిస్తారని వెల్లడించింది.

ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరుకావడం ఇది పదోసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల నేపథ్యంలో పలువురు నేతలతో ప్రధాని భేటీ కానున్నారు. కాగా, ఆసియాన్ 10 దేశాలతో కూడిన సంస్థ. భారత్‌తో పాటు లావో పీడీఆర్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, బ్రూనై దారుస్సలాం ఉన్నాయి. మరోవైపు లావోస్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా మయన్మార్ వివాదం చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. 


Similar News