వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్ పథకాన్ని ప్రారంభించిన మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక పథకానికి శ్రీకారం చుట్టారు.

Update: 2022-10-17 10:45 GMT

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక పథకానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ రంగంలో నూతన ఒరవడిని తీసుకొచ్చేందుకు వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్ పథకాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. జాతీయ రాజధానిలోని భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా 600 ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను(పీఎంకేఎస్‌కే) కూడా ప్రారంభించారు. భారత్ అనే బ్రాండ్ పేరుతో కంపెనీలు అన్ని సబ్సిడీ ఎరువులను మార్కెట్ చేయడం తప్పనిసరని కేంద్రం పేర్కొంది.

ఈ మేరకు భారత్ బ్రాండ్‌‌తో యూరియాను ఆవిష్కరించారు. సహజ వ్యవసాయమే భవిష్యతు సవాళ్లను పరిష్కరించేందుకు ముఖ్యమైన మార్గమని ఆయన అన్నారు. ఒకే దేశం-ఒకే ఎరువు పథకం ద్వారా రైతులు అన్ని రకాల గందరగోళాల నుండి బయటపడగలరని చెప్పారు. అంతేకాకుండా మంచి ఎరువు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. సాంకేతికత ఆధారిత ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. గత 7-8 సంవత్సరాలలో 70 లక్షల హెక్టార్లకు పైగా భూమి మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకువచ్చినట్లు చెప్పారు. 1.75 కోట్ల మందికి పైగా రైతులు, 2.5 లక్షల మంది వ్యాపారులు ఇ-నామ్‌తో అనుసంధనమయ్యారని, దీనిలో లావాదేవీలు రూ.2లక్షల కోట్లు దాటాయని అన్నారు.

వ్యవసాయ రంగంలో మరిన్ని స్టార్టప్‌లు రంగానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మంచిని సూచిస్తాయని పేర్కొన్నారు. కాగా, కేంద్రం రెండు రోజుల పాటు నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, మన్సూఖ్ మాండవీయాలతో పాటు 13,500 రైతులు, 1,500 అగ్రిస్టార్టప్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎరువులపై రూపొందించిన ఈ మ్యాగజైన్ ఇండియన్ ఎడ్జ్‌ను ప్రధాని ప్రారంభించారు.

పీఎంకేఎస్‌కే అంటే?

పీఎంకేఎస్‌కే రైతుల అనేక రకాల అవసరాలను తీరుస్తుంది. వ్యవసాయ అవసరాలు (ఎరువులు, విత్తనాలు, పనిముట్లు), నేల, విత్తనాలు, ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలను అందిస్తుంది. దీంతో పాటు రైతులకు అవగాహన కల్పించడం, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. బ్లాక్/జిల్లా స్థాయి అవుట్‌లెట్‌లలో రిటైలర్‌ల క్రమబద్ధమైన సామర్థ్యాన్ని పెంచేలా చూస్తూ, 3.3 లక్షలకు పైగా రిటైల్ ఎరువుల దుకాణాలను దశల వారీగా పీఎంకేఎస్‌కేగా మార్చడానికి కేంద్రం ప్రణాళిక చేసింది.

పీఎం కిసాన్ నిధులు రూ.16,000 కోట్లు విడుదల..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ పథకంలో 16వ విడుత నిధులను ప్రధాని విడుదల చేశారు. సుమారు రూ.16,000 కోట్లతో 11 కోట్ల మంది లబ్ధిదారులైన రైతులు ప్రయోజనం పొందనున్నారు. కాగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం రూ.2.16 లక్షల కోట్లు దాటింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఏటా రైతుల ఖాతాల్లో రూ.6,000 మూడు విడుతల్లో కేంద్రం జమచేస్తోంది. ఈ పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేంద్రమే ఇస్తోంది.


Similar News