Supreme Court : సుప్రీంకోర్టు యూట్యూబ్ చానల్ హ్యాక్.. కంటెంట్ ప్రైవేట్ చేసిన హ్యాకర్లు!
సైబర్ కేటుగాళ్లు ఏకంగా భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యూట్యూబ్ చానల్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ కేటుగాళ్లు ఏకంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యూట్యూబ్ చానల్‌ను హ్యాక్ చేశారు. ఆ చానల్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన వీడియోలు కంటెంట్ తాజాగా కనపడటం లేదు. దాని స్థానంలో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేసేలా పోస్టులు కనిపిస్తున్నాయి.
పిల్, బెంచ్‌ల ముందు జాబితా చేయబడిన కేసుల విచారణలు యూట్యూబ్ చానల్ ద్వారా సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమ్ కోసం యూట్యూబ్‌ను ఉపయోగిస్తోంది. ఆ వీడియోల స్థానంలో అమెరికాలోని రిపిల్ ల్యాబ్స్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ అయిన ఎక్స్ఆర్పీని ప్రచారం చేస్తున్న వీడియోలు ప్రత్యక్షం అయ్యాయి. విచారణల వీడియోలను హ్యాకర్లు ప్రైవేట్‌గా ఉంచినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ చానల్ హ్యాకింగ్‌పై ప్రస్తుతం సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.