Supreme Court: కర్ణాటక హైకోర్టు జడ్జిపై ఆగ్రహం.. వివాదాస్పద వ్యాఖ్యలపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు
కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మండిపడింది.
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి నివేదికను కోరింది. జస్టిస్ శ్రీశానంద.. ఓ కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో ముస్లింలు మెజార్టీగా ఉన్న ప్రాంతాన్ని"పాకిస్తాన్" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఒక మహిళా న్యాయవాదితో స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ శ్రీశానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వైరల్ వీడియోలను గమనించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. కోర్టులు న్యాయపరమైన ఆకృతిని కొనసాగించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కోర్టులో జడ్జిల వ్యాఖ్యలకు సంబంధించి వారి కోసం స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందంది.
సోషల్ మీడియాది చురుకైన పాత్ర
ఇకపోతే, కోర్టు కార్యకలాపాలను పర్యవేక్షించడం, విస్తరించడంలో సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తుందని సీజేఐ ధర్మాసనం గుర్తుచేసింది. అలాంటప్పుడు కోర్టులు చేసే వ్యాఖ్యలు న్యాయస్థాన నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడటం అత్యవసరమంది. విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మీడియా కథనాలపై ధర్మాసనం దృష్టి సారించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుండి సూచనలను కోరిన తర్వాత నివేదికను సమర్పించాలని కర్ణాటక హైకోర్టుని సీజేఐ కోరారు.