Piyush Goyal: 25 శాతానికి తయారీ రంగం వాటా.. కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్

2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 25 శాతానికి చేరుతుందని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ అంచనా వేశారు.

Update: 2024-09-25 14:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 25 శాతానికి చేరుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ అంచనా వేశారు. మేక్ ఇన్ ఇండియా పదో వార్షికోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియాలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి భారత్ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అమృత్ కాల్‌లో భాగంగా తయారీ రంగం వాటా పెరుగుతుందన్నారు. భారత్‌ను మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా, ఒక కీలకమైన ఉత్పాదక గమ్యస్థానంగా ప్రపంచం చూస్తోందని చెప్పారు. మోడీ హయాంలోని పదేళ్ల పాలనకు, గత పాలనకు ఎంతో తేడా ఉందన్నారు. 2004 నుంచి 2014 వరకు భారత్ ఎంతో వెనుకబడిందన్నారు. ఫలితంగా పెట్టుబడి దారులు ఇండియాపై ఆసక్తి చూపడానికి ముందుకు రాలేదని తెలిపారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక నిల్వల వృద్ధి క్షీణించాయని, రూపాయి విలువ పడిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు. మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత గత దశాబ్దంలో కోల్పోయింది తిరిగొచ్చిందని కొనియాడారు. సాంకేతికత, ఆవిష్కరణలను ప్రోత్సహించడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్నారు. ఉద్యోగాల కల్పనకు తయారీ రంగం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోందని స్పష్టం చేశారు.


Similar News