Madhya Pradesh : గిరిజన హాస్టల్‌లో ప్రమాదం.. ట్యాంకులోకి దిగి కరెంటు షాక్‌తో ఇద్దరు విద్యార్థుల మృతి

దిశ, నేషనల్ బ్యూరో : మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ గిరిజన హాస్టల్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

Update: 2024-09-25 15:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ గిరిజన హాస్టల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం క్లీన్ చేసేందుకు హాస్టల్‌లోని నీటిట్యాంకులోకి దిగిన ఇద్దరు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. ట్యాంకులోని వాటర్ పంపు వద్దనున్న విద్యుత్ తీగను పట్టుకోగానే వారు విద్యుదాఘాతానికి గురై స్పృహ తప్పి పడిపోయారు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు, స్థానికులు వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారాన్ని అందించారు. వికాస్ సింగ్ (17), ఆకాశ్ నినామా (18) అనే ఆ ఇద్దరు విద్యార్థులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయారని వెల్లడించారు.

హాస్టల్ వార్డెన్ బన్‌సింగ్ కనౌజ్ బలవంతం చేసినందు వల్లే తమ పిల్లలు వాటర్ ట్యాంకులోకి దిగారని చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రియాంక్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై దర్యాప్తునకు ఏరియా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, ఎలక్ట్రిసిటీ విభాగం ఇంజినీర్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు. చనిపోయిన విద్యార్థులకు చెరో రూ.2 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియాను అందిస్తామని కలెక్టర్ తెలిపారు. రెడ్ క్రాస్ ఫండ్ నుంచి వారికి మరో రూ.లక్ష చొప్పున సాయాన్ని అందిస్తామని చెప్పారు.


Similar News