Supreme court: పాట్నా హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్.. కారణమిదే?

వితంతువులకు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదంటూ పాట్నాహైకోర్టు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని సుప్రీంకోర్టు అభివర్ణించింది.

Update: 2024-09-25 18:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వితంతువులకు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదంటూ పాట్నా హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని సుప్రీంకోర్టు అభివర్ణించింది. అటువంటి కామెంట్స్ న్యాయస్థానం నుంచి ఆశించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది.1985 నాటి హత్య కేసులో పాట్నా హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఈ కేసులో ఓ మహిళను కిడ్నాప్ చేసి హత్య చేయగా.. భూమిని కబ్జా చేసేందుకే మర్డర్ చేశారని ఆరోపణలున్నాయి. దీంతో ఈ కేసులో పాట్నా హైకోర్టు ఏడుగురిని దోషులుగా తేల్చి వారికి జీవితఖైదు విధించింది. మరో ఇద్దరు సహ నిందితులను నిర్ధోషులుగా ప్రకటించింది.

దీంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. జస్టిస్ బేల ఎం త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితులు హత్యకు పాల్పడ్డారని నిరూపించేందుకు సాక్ష్యాధారాలు ఏవీ రికార్డుల్లో లేవని తెలిపింది. ఈ మేరకు ఏడుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. కేవలం కొన్ని మేకప్ వస్తువులు ఉండటం వల్ల ఆ మహిళ ఆ ఇంట్లో నివసిస్తోందనడానికి రుజువు కాదని పేర్కొంది. దర్యాప్తు అధికారి ఇంటిని తనిఖీ చేశారని, కొన్ని మేకప్ వస్తువులు తప్ప, బాధితురాలు అక్కడ నివసిస్తున్నట్లు సూచించడానికి ఆధారాలు ఏమీ లభించలేదని బెంచ్ తెలిపింది. హైకోర్టు పరిశీలనలు చట్టపరంగా ఆమోదయోగ్యం కానివని, అంతేగాక విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సైతం అభ్యంతరకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.


Similar News