Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. జిరిబామ్ జిల్లాలోని ఓ గ్రామంపై కాల్పులు

మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో మరోసారి హింస చెలరేగింది. బోరోబెక్రా గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు కాల్పులు జరిపారు.

Update: 2024-10-19 11:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో మరోసారి హింస చెలరేగింది. శనివారం తెల్లవారుజామున బోరోబెక్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు కాల్పులు జరిపారు. అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారని తెలిపారు. అంతేగాక గ్రామంపై బాంబులు కూడా వేసినట్టు అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సాయుధుల పైకి ఎదురు కాల్పులు జరిపారు.

అయితే ఈ దాడిలో ఎంత మందికి గాయాలయ్యాయి అనే విషయాన్ని వెల్లడించలేదు. హింస నెలకొన్న ప్రాంతం నుంచి వృద్ధులు, మహిళలు, చిన్నారులను భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. బోరోబెకరా గ్రామం జిరిబామ్ టౌన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, పర్వతాలు ఉన్నాయి. గతేడాది మే నుంచి అల్లర్లు జరుగుతున్నప్పటి నుంచి కూడా ఇక్కడ కాల్పుల ఘటనలు వెలుగు చేశాయి. మరోవైపు ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఈ నెల 15న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో మైతీ, కుకీ, నాగా వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇకపై హింసకు తావివ్వబోమని వారితో ప్రతిజ్ఞ చేయించారు. అయితే మీటింగ్ జరిగిన 4 రోజుల వ్యవధిలోనే మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. అంతకుముందు శుక్రవారం జిరిబామ్‌లోని కాలీనగర్ హమర్ వెంగ్ ప్రాంతంలోని ఓ పాఠశాలకు దుండగులు నిప్పుపెట్టారు.


Similar News