Mamata banerjee: నిరాహార దీక్ష విరమించండి.. జూనియర్ డాక్టర్లకు మమతా బెనర్జీ ఫోన్

జూనియర్ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి అనంతరం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ వైద్యులు ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-19 13:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి, హత్య అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ పలువురు వైద్యులు ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. దీక్ష విరమించాలని వారికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ల డిమాండ్లను ఇప్పటికే చాలా వరకు నెరవేర్చామని, పలు అంశాలపై చర్యలు కూడా తీసుకున్నామని తెలిపారు. మిగతా వాటిని సైతం ప్రభుత్వం పరిశీలిస్తోందని.. అందుకు 3 నుంచి 4 నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఇదే విషయమై సోమవారం చర్చలకు రావాలని మరోసారి పిలుపునిచ్చారు. దీక్ష విరమించి వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. ఆందోళనల వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఆరోగ్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తమ డిమాండ్లు పరిష్కరించపోతే మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో సమ్మె చేస్తామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మమతా వారితో ఫోన్‌లో మాట్లాడటం గమనార్హం. మరోవైపు పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్, హోం సెక్రటరీ నందిని చక్రవర్తి శనివారం జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న ప్రదేశానికి వెళ్లి వారితో మాట్లాడారు. 

Tags:    

Similar News