Odisha man: అవయవ చోరీ ఆరోపణలు.. పాతిపెట్టిన మృతదేహం వెలికితీత !

ఆస్పత్రిలో మరణించిన ఓ వ్యక్తి అవయవాలను దొంగిలించారని ఆరోపణలు రావడంతో పాతి పెట్టిన మృతదేహాన్నిపోస్టుమార్టం కోసం బయటకు తీశారు.

Update: 2024-10-19 14:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆస్పత్రిలో మరణించిన ఓ వ్యక్తి అవయవాలను దొంగిలించారని ఆరోపణలు రావడంతో పాతి పెట్టిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బయటకు తీశారు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని తికర్బాజు గ్రామానికి చెందిన బాబులా దిగాల్ అనే వ్యక్తి ఈ నెల 13న రోడ్డు ప్రమాదంలో గాయపడగా కటక్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి 16వ తేదీన మరణించారు. అయితే ఆస్పత్రి అధికారులు పోస్ట్ మార్టం నిర్వహించకుండానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృత దేహాన్ని ఇంటికి తీసుకెళ్తుండగా.. మృతుడి తలపై గాయాలైతే.. పొట్టపై కుట్లు వేసిన గుర్తులు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. మృతుడి శరీరం నుంచి కొన్ని అవయవాలను డాక్టర్లు బయటకు తీశారని ఆరోపించారు. కానీ అంత్యక్రియల అనంతరం ఈ విషయంపై పోలీసులకు మృతుడి కుమారుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పాతి పెట్టిన మృత దేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్ విచారణకు ఆదేశించారు. ఈ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఆస్పత్రి యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది. 


Similar News