Chhattisgarh : ఐఈడీ పేల్చిన మావోయిస్టులు.. ఇద్దరు ఐటీబీపీ జవాన్లు మృతి

దిశ, నేషనల్ బ్యూరో : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ప్రతీకారానికి తెగబడ్డారు.

Update: 2024-10-19 13:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ప్రతీకారానికి తెగబడ్డారు. అబూజ్‌మడ్ ప్రాంతంలోని కొడ్లియార్ గ్రామం సమీపంలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలిన ఘటనలో ఇద్దరు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్లు చనిపోయారు. నారాయణ్‌పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.నారాయణ్‌పూర్ జిల్లా ధుర్బేద గ్రామం శివారులోని అడవుల్లో ఐటీబీపీ, బీఎస్ఎఫ్, నారాయణ్‌పూర్ జిల్లా పోలీసులు సంయుక్తంగా సుదీర్ఘ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. మావోయిస్టుల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ ముగిసిన వెంటనే ధుర్బేద గ్రామం నుంచి నారాయణ్‌పూర్ జిల్లా కేంద్రానికి భద్రతా దళాల కాన్వాయ్ బయలుదేరింది.

ఈక్రమంలో మార్గం మధ్యలో కొడ్లియార్ గ్రామం వద్ద ఐఈడీ పేలింది. దీన్ని మావోయిస్టులే అమర్చి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన ఐటీబీపీ సిబ్బందిని ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన కె.రాజేష్ (36), మహారాష్ట్రలోని సతారాకు చెందిన అమర్ పన్వర్‌(36)గా గుర్తించారు. వీరు ఐటీబీపీ 53వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. గాయపడిన ఇద్దరు పోలీసు సిబ్బందిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. రెండు వారాల క్రితమే అబూజ్‌మడ్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకునే క్రమంలోనే కొడ్లియార్ గ్రామం సమీపంలో ఐఈడీని మావోయిస్టులు అమర్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. 


Similar News