క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయండి
గతంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: గతంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ చట్టాల అమలు తేదీని వాయిదా వేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆమె తన లేఖలో మూడు క్రిమినల్ చట్టాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య చట్టం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టాలను ఏకపక్షంగా తీసుకొచ్చారు. క్లిష్టమైన బిల్లులపై ఎటువంటి చర్చ లేకుండానే లోక్‌సభలో ఆమోదించారు. ఆ రోజు, దాదాపు 100 మంది లోక్‌సభ సభ్యులను సస్పెండ్ చేసి, ఉభయ సభలకు చెందిన మొత్తం 146 మంది ఎంపీలను పార్లమెంటు నుండి బయటకు పంపి నిరంకుశ పద్ధతిలో బిల్లును ఆమోదింపజేశారు. కానీ ఇప్పుడు దీని గురించి కొత్తగా ఎన్నికైన పార్లమెంట్‌లో చర్చించడం ద్వారా ఆ చట్టాలను సమీక్షించే అవకాశం ఉంటుంది, వేగంగా ఆమోదించబడిన కొత్త చట్టాలకు సంబంధించి ప్రజలలో విస్తృత అనుమానాలు ఉన్నాయి, చట్టాల అమలును వాయిదా వేయడం ద్వారా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు వాటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి అవకాశం కల్పిస్తుందని ఆమె లేఖలో రాశారు.
మూడు క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలనే మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను, వాయిదా వలన న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం బలోపేతం అవుతుందని, దేశంలో చట్టబద్ధమైన పాలనను సమర్థిస్తుందని బెనర్జీ లేఖలో చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను కేంద్రం తీసుకువచ్చింది. మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయ మంత్రి తెలిపారు.