Iran : ఇరాన్, ఇజ్రాయెల్ మాటల యుద్ధం.. నెతన్యాహు, ఖమేనీ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఆవరించిన యుద్ధ మేఘాలు యావత్ పశ్చిమాసియా ప్రాంతాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఆవరించిన యుద్ధ మేఘాలు యావత్ పశ్చిమాసియా ప్రాంతాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఇరాన్(Iran)పై ఈనెల 26న తెల్లవారుజామున తాము చేసిన ప్రతీకార దాడి సక్సెస్ అయిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలు, మిస్సైళ్ల తయారీ కేంద్రాలను ధ్వంసం చేశామని ఆయన వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్(Israel) వాదనను ఖండిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరో ప్రకటన విడుదల చేశారు. తమ దేశంపై దాడి చేసినందుకు ఇజ్రాయెల్‌కు తగిన సమాధానం లభిస్తుందన్నారు. ‘‘మాదేశం సత్తా ఏమిటో ఇక ఇజ్రాయెల్‌కు చూపిస్తాం. దీనిపై తగిన ప్రణాళికను మా సైన్యం రెడీ చేస్తుంది’’ అని ఖమేనీ వెల్లడించారు. పాలస్తీనా, లెబనాన్‌లకు అన్ని రకాలుగా తమ సాయం కొనసాగుతుందన్నారు. 85 ఏళ్ల వయసు కలిగిన ఆయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఒకవేళ ఆయనకు ఏదైనా జరిగితే.. తదుపరి ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ(Ayatollah Khamenei) రెండో కుమారుడు 55 ఏళ్ల ముజ్తబా ఖమేనీని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇరాక్ నుంచి ఇరాన్‌పైకి..
యుద్ధ విమానాలతో దాడి చేశామంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనను ఇరాన్ సైన్యం ఖండించింది. ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి అస్సలు ప్రవేశించలేదని స్పష్టం చేసింది. అవి సరిహద్దుల్లోని ఇరాక్ గగనతలం నుంచి తమ దేశంపైకి మిస్సైళ్లను ప్రయోగించాయని తెలిపింది. ఇరాక్ గగనతలాన్ని దుర్వినియోగం చేసినందుకు ఇజ్రాయెల్‌పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనిపై తాము ఐరాసకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.
టెల్అవీవ్‌లో ట్రక్కు బీభత్సం.. ఒకరి మృతి, 40 మందికి గాయాలు
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సమీపంలోని సైనిక స్థావరం వద్ద జనంపైకి ఒక ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 40 మందికిపైగా గాయాలపాలయ్యారు. స్థానికులు కాల్పులు జరపడంతో సదరు ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు.
కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చలు షురూ
ఖతర్ రాజధాని దోహా వేదికగా ఇజ్రాయెల్, పాలస్తీనా చర్చలు ఆదివారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో ఇజ్రాయెల్, ఖతర్, ఈజిప్ట్, అమెరికా, పాలస్తీనా ప్రతినిధులు పాల్గొన్నారు. గాజాలో హమాస్ అదుపులో ఉన్న ఇజ్రాయెలీ బందీలను విడిపించే అంశంపై ఈసందర్భంగా డిస్కషన్ జరిగింది. నలుగురు ఇజ్రాయెలీ బందీల విడుదలకుగానూ 2 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌సిసి ప్రతిపాదించారు. ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేసిన ప్రతిసారి.. కొందరు పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నారు.