Tejasvi Surya :‘ఐరన్ మ్యాన్’ ఎంపీ తేజస్వి సూర్య.. 70.3 మైళ్ల ఛాలెంజ్‌ పూర్తి

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ(BJP) ఎంపీ (దక్షిణ బెంగళూరు) 33 ఏళ్ల తేజస్వి సూర్య మరోసారి తన ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు.

Update: 2024-10-27 17:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ(BJP) ఎంపీ (దక్షిణ బెంగళూరు) 33 ఏళ్ల తేజస్వి సూర్య మరోసారి తన ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు. గోవాలో జరిగిన ‘ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్’‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి ఎంపీగా ఆయన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన 1.9 కి.మీ ఈతకొట్టారు. 90 కి.మీ మేర సైక్లింగ్ చేశారు. 21.1 కి.మీ మేర రన్నింగ్ చేశారు. ఈ ఈవెంట్‌లోని అన్ని విభాగాలను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నెలల పాటు తేజస్వి సూర్య(Tejasvi Surya) శ్రమించారు. ఈసందర్భంగా ఆయనను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) ట్వీట్ చేశారు. తేజస్వి సూర్య సాధించిన ఈ ఫీట్ ఎంతోమంది యువతను ఫిట్‌నెస్ యాక్టివిటీస్ దిశగా నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2022 సంవత్సరంలో గోవాలో జరిగిన ఈ పోటీల్లోనూ తేజస్వి పాల్గొన్నప్పటికీ.. కేవలం సైక్లింగ్ విభాగాన్ని ఆయన పూర్తి చేయగలిగారు. ఈసారి జరిగిన పోటీల్లో 50కిపైగా దేశాలకు చెందిన ఔత్సాహికులతో పాటు భారత్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 120 మందికిపైగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. కాగా, ఈత, సైక్లింగ్, రన్నింగ్ ఈవెంట్స్ కలిసి ఉన్నందు వల్లే దీనికి ట్రయాథ్లాన్ అనే పేరు వచ్చింది. ఈ మూడు ఈవెంట్ల మొత్తం టార్గెట్ 70.3 మైళ్లు (113 కి.మీ). అందుకే ఈ ఈవెంట్‌కు ‘ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్’‌ అనే పేరు పెట్టారు.

Tags:    

Similar News