'శృంగార ‘సమ్మతి’ వయసు తగ్గించొద్దు'.. కేంద్రానికి 'లా కమిషన్' నివేదిక

Update: 2023-09-29 14:02 GMT

న్యూఢిల్లీ : పోక్సో చట్టం ప్రకారం.. ప్రస్తుతమున్న శృంగార ‘సమ్మతి’ కనీస వయసును(18 సంవత్సరాలు) తగ్గించొద్దని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి 'లా కమిషన్‌' నివేదిక సమర్పించింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసును 18 సంవత్సరాల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనలను వ్యతిరేకించింది. సమ్మతి వయసును మార్చడం అంత మంచిది కాదని 'లా కమిషన్‌' అభిప్రాయపడింది. సమ్మతి వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తే.. అది బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.

16-18 ఏళ్ల పిల్లలకు సంబంధించిన పోక్సో కేసుల్లో.. వారు ఇష్టపూర్వకంగానే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొని ఉంటే, వాటి పరిష్కారానికి చట్టంలో కొన్ని సవరణలు అవసరమని 'లా కమిషన్' తెలిపింది. అటువంటి ప్రత్యేక కేసుల్లో శిక్షలను విధించేటప్పుడు కోర్టులు విచక్షణతో తీర్పులు ఇవ్వాలని సూచించింది. 16-18 ఏళ్ల పిల్లలకు సంబంధించిన కేసుల్లో వారు తమ సమ్మతిని తెలియజేస్తే.. అది కౌమారదశలోని అనియంత్రిత ప్రేమనా..? క్రిమినల్‌ ఉద్దేశాలు ఉన్నాయా..? అనేది గుర్తించాలని సూచించింది.

ఈ-ఎఫ్‌ఐఆర్‌, యూసీసీపై..

ఇక ‘ఈ-ఎఫ్‌ఐఆర్‌’ నమోదు విధానాన్ని దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రానికి లా కమిషన్‌ సిఫారసు చేసింది. తొలి దశలో మూడేళ్ల దాకా శిక్షపడే నేరాలకు సంబంధించి కేసుల్లో ఈ పద్ధతిని అమల్లోకి తేవాలని సూచించింది. ఈ-ఎఫ్‌ఐఆర్‌ల నమోదు కోసం కేంద్రీకృత జాతీయ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల కేసుల నమోదులో ఆలస్యం ఉండదని, నేరం జరిగిన వెంటనే పౌరులు ఫిర్యాదులు చేసేందుకు వీలుంటుందని 'లా కమిషన్‌' అభిప్రాయపడింది. ఇక ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పైనా 'లా కమిషన్‌' తమ నివేదికను కేంద్రానికి సమర్పించింది. స్వలింగ వివాహాలు యూసీసీ కిందకు రావని తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.


Similar News