Bhopal: మధ్యప్రదేశ్ డ్రగ్స్ రాకెట్ వెనుక విస్తుపోయే వాస్తవాలు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. అక్టోబర్ 6న భోపాల్ శివార్లలో రూ. 1,814.18 కోట్ల విలువైన 907.09 కిలోల మెఫెడ్రోన్ (MD)ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-10-09 07:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. అక్టోబర్ 6న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివార్లలో రూ. 1,814.18 కోట్ల విలువైన 907.09 కిలోల మెఫెడ్రోన్ (MD)ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్త ఆపరేషన్‌లో డ్రగ్స్ తయారీ యూనిట్ ని గుర్తించారు. ఆ డ్రగ్స్ తయారీ యూనిట్‌ లో రోజుకు 25 కిలోల ఎండీ డ్రగ్‌ను తయారు చేసే సామర్థ్యం ఉందని అధికారులు వెల్లడించారు. భోపాల్ శివార్లలోని బగ్రోడా పారిశ్రామిక వాడలో ఈ సోదాలు జరిగాయి. గుజరాత్ ఏటీఎస్ నిర్వహించిన అతిపెద్ద డ్రగ్ రాకెట్ గా అధికారులు వెల్లడించారు. ఇకపోతే, ఈ కేసులో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తయారీ యూనిట్ ని కనుగొన్న వెంటనే ఎన్డీటీవీ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఆ ఆపరేషన్ లో సంచలనాలు బయటకొచ్చాయి.

ఎన్డీటీవీ స్టింగ్ ఆపరేషన్

భోపాల్‌ను పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు స్టింగ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇట్వారా, బుద్వారాలోని బిట్టెన్ మార్కెట్, 74 బంగ్లా సహా సిటీ అంతా డ్రగ్ పెడ్లర్లు బహిరంగంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ డ్రగ్ రాకెట్‌ను వెలికితీసేందుకు ఎన్‌డీటీవీకి చెందిన అనురాగ్ ద్వారీ, అజయ్ శర్మ డ్రగ్స్ వాడే వారిని సంప్రదించారు. సీక్రెట్ ఆపరేషన్ లో హష్, గంజాయి, బ్రౌన్ షుగర్, ఎండీ, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాలు విస్తృతంగా లభ్యమవుతున్నాయని వెల్లడైంది. డ్రగ్ పెడ్లర్ల విస్తృత నెట్ వర్క్ ద్వారా డ్రగ్స్ ని చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నట్లు తేలింది. ఇకపోతే, భోపాల్‌లో మాదకద్రవ్యాల వ్యాపారం ఆర్థిక సరిహద్దులు దాటింది. అన్ని వర్గాల కస్టమర్లను ఆకర్షించేలా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఎన్డీటీవీ దర్యాప్తులో తేలింది. యువత నుండి వీధి వ్యాపారుల వరకు, సులభంగా అందుబాటులో ఉండే వారిద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించింది. పెడ్లర్లుగా టీ స్టాల్స్‌లో పనిచేసే వ్యక్తులు, వీధి వ్యాపారులు, కళాశాల విద్యార్థులు ఉన్నారు. హాట్‌స్పాట్‌లను గుర్తించిన తర్వాత డ్రగ్ పెడ్లర్లతో ఎన్డీటీవీ బృందం మాట్లాడింది. అయితే, వారి బెదిరింపులతో వెనుదిరిగి వచ్చేసింది. అధికారుల భయం లేకుండా డీలర్లు బహిరంగంగానే డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, సీనియర్ బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు నివసించే 74 బంగ్లాస్ వంటి VVIP ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ లావాదేవీలు జరుగుతున్నట్లు సీక్రెట్ ఆపరేషన్ లో వెల్లడైంది. పెడ్లర్లతో సంభాషణలు భోపాల్ డ్రగ్ అండర్ వరల్డ్‌ ని 'సాహు జీ' అని పిలిచే వ్యక్తి శాసిస్తున్నట్లు తేలింది.

రాజకీయ విమర్శలు

భారీగా డ్రగ్స్ స్వాధీనం కావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం డ్రగ్స్ ముప్పను పరిష్కరించడంలో విఫలమైందని మండిపడుతున్నారు. డ్రగ్స్ ముప్పును పరిష్కరించడంలో బీజేపీ విఫలమైందని వాదించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతూ పట్వారీ రూ.1,800 కోట్ల డ్రగ్స్ పట్టివేత "దురదృష్టకరం,సిగ్గుచేటు" అని అన్నారు. డ్రగ్స్ మాత్రం అందరికీ అందుబాటులో ఉన్నాయని.. మహిళలు నీటి కోసం 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందన్నారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి యశ్ భారతీయ పోలీసులపై విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్ పోలీసు బలగాలకు అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ నిద్రపోతోందని ఆరోపించారు. ఇకపోతే, గుజరాత్ ప్రభుత్వం మాత్రం మధ్యప్రదేశ్ అధికారులకు అభినందనలు తెలిపింది. ఈ ఆపరేషన్ లో సహకరించిన పోలీసులకు గుజరాత్ హెంమంత్రి హర్ష్ సంఘవి ధన్యవాదాలు తెలిపారు. డ్రగ్స్ రవాణాను అరికట్టుంకు కేంద్రసంస్థలు, ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని అన్నారు. కాగా.."మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రతిచర్యలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ను" అని ముఖ్యమంత్రి యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News