ప్రధాని మోడీని కలిసిన హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ
హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిశారు.
దిశ, వెబ్ డెస్క్ : హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, సమాచారాన్ని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన పిదప సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రధాని మోడీని కలువడం ఆసక్తి రేపింది. మోడీకి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని నయాబ్ సింగ్ బహుకరించారు. విపక్షాలతో హోరాహోరిగా సాగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన మోడీ సీఎం నయాబ్ సింగ్ ను అభినందించారు. వికసిత్ భారత్ లో హర్యానా కీలక భూమిక పోషిస్తుందని నాకు నమ్మకం ఉందన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వ ఏర్పాటు అంశాలపై వారు చర్చించారు. అనంతరం సీఎం నయాబ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ పెద్దలను కలుసుకున్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో అప్పటీ సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ ను తప్పించి ఓబీసీ నేత నయాబ్ సింగ్ ను బీజేపీ అధిష్టానం సీఎంను చేసింది. నయాబ్ సింగ్ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిన బీజేపీ ఆశించిన విజయాన్ని అందుకోగల్గింది. నయాబ్ సింగ్ సైనీని సీఎంను చేయడం ద్వారా జాట్ యేతర ఓటర్లను ఆకట్టుకోవడంలో బీజేపీ సఫలమైంది. అంతేగాక సీఎం నయాబ్ సింగ్ అనుసరించిన ఎన్నికల ప్రచార వ్యూహాలు, పోల్ మేనేజ్ మెంట్ ఫలించడం..అదే సమయంలో విపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం, కాంగ్రెస్ లో అనైక్యత వంటి అంశాల మధ్య బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించింది.