రైలుపట్టాలపై ఇనుప స్తంభం.. త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం
దేశంలో ఎక్కడ చూసినా రైళ్లపై దాడులు పెరిగిపోతున్నాయి. పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, మట్టి దిబ్బలు, కొండరాళ్లు, స్తంభాలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా రైలు ప్రమాదాలను సృష్టించడానికి దుండగులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎక్కడ చూసినా రైళ్లపై దాడులు పెరిగిపోతున్నాయి. పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, మట్టి దిబ్బలు, కొండరాళ్లు, స్తంభాలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా రైలు ప్రమాదాలను సృష్టించడానికి దుండగులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ (MadhyaPradesh)లో ఇలాంటి సంఘటనే సంభవించింది. అయితే రైల్వే లోకో పైలట్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం(అక్టోబర్ 09) తెల్లవారుజామున 4.30 గంటలకు ఝాన్సీ నుంచి ఆగ్రాకు ఓ గూడ్స్ ట్రైన్ (Goods Train) వెళుతోంది. అయితే ఆ ట్రైన్ గ్వాలియర్ (Gwalior) సమీపంలోని రాగానే రైలు పట్టాలపై బిర్లానగర్ సమీపంలో ఓ పెద్ద ఇనుప ఫ్రేమ్ ఉన్నట్లు గూడ్స్ రైలు లోకో పైలట్ (Loco Pilot) గమనించి వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేసి రైలును ఆపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అనంతరం రైల్వే అధికారుల (Railway Officials)కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఇనుప ఫ్రేమ్ (Iron Frame)ను స్వాధీనం చేసుకుని.. గుర్తు తెలియని వ్యక్తులపై రైల్వే చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. అక్టోబర్ 6న రఘురాజ్ సింగ్ స్టేషన్ (Raghuraj singh Railway Station) సమీపంలో రైలు పట్టాలపై మట్టి కుప్పలు కనిపించాయి. అటుగా వస్తున్న ప్యాసింజర్ ట్రైన్ లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ఆ ప్రమాదం కూడా తప్పింది.